ప్రధానికి చుక్కలు చూపించిన బుడ్డోడు!
బ్రిటన్ రాజవంశపు బుజ్జి యువరాజు జార్జ్ తెలుసు కదా! ఆ బుడతడు తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు ఒక చిన్నపాటి షాకిచ్చాడు. కెనడా ప్రధాని ట్రుడో తనదైన విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదేవిధంగా బుజ్జి జార్జ్‌ను ఆకట్టుకోవడానికి ట్రుడో ప్రయత్నించాడు. ఆ బుజ్జాయిను మురిపించడానికి మోకాళ్లపై కూచోని షేక్‌హ్యాండ్ ఇవ్వమని కోరాడు. చేయి చాపి షేక్‌హ్యాండ్ ఇవ్వమని ఒకింత బతిమాలుకున్నాడు. అయినా.. బుజ్జి జార్జ్ వింటే కదా.. 'నో' అంటూ అడ్డంగా తలూపాడు. ఇక లాభం లేదనుకొని ప్రధానిగారు పైకిలేచి ఈ చిన్నపాటి ఎదురుదెబ్బను దిగమింగుకున్నారు.
బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం ఓ వారంపాటు విహరించడానికి కెనడాకు వెళ్లింది. రాజకుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో ఆదివారం బ్రిటిష్ కొలంబియా విమానాశ్రయానికి వచ్చారు. ఆయనతోపాటు పలువురు కెబినెట్ మంత్రులు కూడా విమానాశ్రయానికి హాజరయ్యారు. వారు కేమ్బ్రిడ్జ్ డ్యూక్, డ్యూచెస్ దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో ప్రిన్స్ విలియమ్-కేట్ దంపతుల పిల్లలు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా బుజ్జి జార్జ్‌ను ఆకట్టుకోవడానికి, అతనితో షేక్‌హ్యాండ్ తీసుకోవడానికి ప్రధాని ట్రుడో చాలా ప్రయత్నించాడు. కానీ, ట్రుడో చేష్టలు జార్జ్‌కు ఏమాత్రం నచ్చన్నట్టు ఉన్నాయి. ఆయన ప్రధాని అనీ, ఒక దేశ పర్యటనకు వచ్చినప్పుడు దౌత్యపరమైన మర్యాదలు పాటించాలన్న సంగతి ఆ బుజ్జాయికి తెలిసి ఉండదేమో! అందుకే తనకు నచ్చని ట్రుడోకు ఏకంగా షాకిచ్చాడు.
రాచరిక వారసుడైన జార్జ్ ప్రపంచ నేతలతో ఇలా ఆటాడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసినప్పుడు జార్జ్‌ను కలిసినప్పుడు కూడా ఇలాగే వార్తల్లో నిలిచాడు. పైజామా ధరించి ఒబామాకు ఈ బుజ్జి జార్జ్ 'హాయ్' చెప్పాడు. పైజామా ధరించి ఒక దేశాధ్యక్షుడితో ముచ్చటించడమంటే అది 'ప్రోటోకాల్' ఉల్లంఘనే. బుజ్జి జార్జ్ దుస్తులు 'లాగి చెంప మీద కొట్టినట్టు' ఉన్నాయని అప్పట్లో ఒబామా జోక్ కూడా చేశారు.