English test
-
'ఇంగ్లీష్ రాకుంటే మా దేశంలో ఉండనివ్వం'
లండన్: బ్రిటన్కు వలసవచ్చేవారు రెండు లేదా రెండున్నరేళ్ల లోపు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే దేశంలో నివసించేందుకు అనుమతించబోమని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. బ్రిటన్లో నివసించే దాదాపు లక్షా 90 వేలమంది ముస్లిం మహిళలకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. ఓ వార్త పత్రికకు రాసిన వ్యాసంలో కామెరూన్.. ఇంగ్లీష్ ఆవశ్యకతను తెలియజేశారు. 'ఇంగ్లీష్ కొద్దిగా తెలుసుని బ్రిటన్కు వలసరావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన అవసరముంది. భాషపై పట్టుసాధించకపోతే దేశంలో నివసించే అవకాశాన్ని కోల్పోతారు' అని పేర్కొన్నారు. కొన్ని మతాలకు చెందిన మహిళలకు ఇంగ్లీష్ భాష నేర్పించేందుకు బ్రిటన్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 20 లక్షల పౌండ్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రత్యేక వీసాపై బ్రిటన్కు వచ్చినవారి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. ఇంగ్లీష్ భాష నైపుణ్యానికి, తీవ్రవాదానికి నేరుగా సంబంధం లేకపోయినా, బ్రిటీష్ సమాజంతో ఇమడలేనివారు తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కామెరూన్ పేర్కొన్నారు. బ్రిటీష్ సమాజంతో కలవకుండా ఆపుతున్న వారికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అన్నారు. కామెరూన్ వ్యాఖ్యలపై ముస్లిం సంస్థల నుంచి విమర్శలు వచ్చాయి. -
ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 19,013 మంది డుమ్మా
సిటీబ్యూరో: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభించారు. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకు విద్యార్థులు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. హైదరాబాద్లో 78,254 మందికి గాను 64,185 మంది (82.02 శాతం) హాజరవగా, రంగారెడ్డి జిల్లాలో 1,14,427కి గాను 1,09,483 మంది (95.67 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. జంట జిల్లాల్లో మొత్తం 19,013 మంది విద్యార్థులు గైర్హాజరు కావడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. కాగా బుధవారం జంట నగరాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్ఐఓ రవికుమార్ తెలిపారు. రంగారె డ్డి జిల్లాలో ఒక కేసు నమోదైందని ఆర్ఐఓ గౌరీ శంకర్ వెల్లడించారు.