చరిత్ర చెరిపేయం
► మరో మార్గంలో సేతు పథకం
► వివాదాలకు అతీతంగా అమలు
► కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ
► ఎన్నూరు హార్బర్లో కొత్త టెర్మినల్ ప్రారంభం
సేతుసముద్ర ప్రాజెక్టు కోసం రామసేతు వంతెనను కూల్చ బోమని కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమిళనాడు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామేగానీ పురాతన రూపాన్ని నిర్మూలించేది లేదని ఆయన అన్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై శివారు ఎన్నూరు కామరాజర్ హార్బర్లో ఐదు కొత్త పథకాలను, రూ.1,270 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సేతు సముద్ర ప్రాజెక్టు కోసం నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యవహారం కోర్టు నుంచి బైటపడిన తరువాత ప్రాజెక్టు పనులు అమలు చేస్తామని అన్నారు. రామసేతు వంతెన విషయంలో ప్రజల మనోభావాలను ఎంతమాత్రం దెబ్బతీయబోమని అన్నారు.
తాను బాధ్యతలు స్వీకరించే ముందు దేశంలో రోజుకు రెండుకిలోమీటర్ల పొడవుకు మాత్రమే రోడ్లను నిర్మించేవారని, ప్రస్తుతం 23 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం సాగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 16,800 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. దేశంలోని హార్బర్ల అభివృద్ధికి రూ.16 లక్షల కోట్లను కేటాయించగా ఇందులో చెన్నైలోని మూడు హార్బర్లకు రూ.4లక్షల కోట్ల వాటా ఉందని తెలిపారు. ఈ ని«ధుల ద్వారా హార్బర్లకు రైలు మార్గాలను అనుసంధానం, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి వంటి పనులు జరుగుతాయని చెప్పారు.
ప్రస్తుతం రెండు లక్షల కార్లు మాత్రమే ఎగుమతి జరుగుతుండగా రాబోయే రోజుల్లో ఐదు నుంచి ఆరు లక్షల కార్లను ఎగుమతి చేసుకునే సామర్థ్యం కలుగుతుందని చెప్పారు. తమిళనాడులో చెన్నై–బెంగళూరు, చెన్నై–హైదరాబాద్ రహదారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. తమిళనాడులో జలమార్గాల రూపకల్పనకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా సముద్రమార్గ రవాణాకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. జలమార్గ రవాణా కోసం రూ.200 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ నిధుల ద్వారా తిరువనంతపురం–కన్యాకుమారి, కన్యాకుమారీ–చెన్నైలకు జలమార్గాల రూపకల్పన చేయవచ్చని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఒక నివేదికను కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. చెన్నైలో అయిల్ కాలుష్య బాధితులకు రూ.203 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ పరిహారం పదిరోజుల్లో అందుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.