అండగా ఉండే నేతలు కావాలి..
కామన్ మ్యాన్ Voice
నగరంలో ప్రతి కూడలిలోను చిరు వ్యాపారులు జీవిస్తుంటారు. వారికి సరైన దుకాణం ఉండదు. రోడ్డుపక్కన, ఫుట్పాత్ పైన చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. అలాంటివారికి ప్రభుత్వం గాని, అధికారులు గాని తగిన భరోసానివ్వరు. మార్గానికి అడ్డంగా ఉందని ఉన్న ఆధారాన్ని తొలగించాలని చూస్తారు. బాగ్ లింగంపల్లిలో బండిపై కొబ్బరి బొండాలు అమ్మే యాదయ్యకు 10 ఏళ్లుగా ఇదే వ్యాపారం బతుకుదెరువు.
ఎన్నికలప్పుడు ఓట్లడిగే నేతలు.. తమలాంటి వారి కోసం ప్రభుత్వ పథకాలు ఉన్నట్టు చెప్పరని, వారి అవసరం తీర్చుకున్నాక తమను పట్టించుకోరని వాపోయాడు. ‘ఎన్నికలప్పుడు వస్తారు.. మంచిగ మాట్లాడతారు. ఆనక కనిపించరు. ఏమన్నా చెప్పుకుందామంటే ముఖం చాటేస్తారు’ అని ఆవేదన చెందాడు. ‘ఎన్నికలప్పుడు గల్లీ గల్లీలో తిరిగే నేతల సందడి సినిమాలా ఉంటది. గెలిసాక వారిని కలవడం మాలాంటోరికి కష్టమే. మాలాంటోళ్లకు దుకాణాలు తీసేయాలని వేధింపులు లేకుండా భరోసా ఇస్తే అదే పదివేలు’ అని పేర్కొన్నాడు. - అంబర్పేట