Entertainment Channel
-
‘స్టార్ మా’ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌గా ‘స్టార్ మా’ అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో ఈ ఘనత సాధించినట్లు స్టార్ మా ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని రీజినల్ చానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా సన్ టీవీని దాటి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్‌గా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మా లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందుంది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళ్తుంది. బిగ్‌బాస్, సిక్స్‌సెన్స్, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. -
సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది
‘‘సినిమా రంగం అభివృద్ధికి దేశంలోనే బెస్ట్ పాలసీ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది’’ అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్య్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బుధవారం హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సినిమా, టీవీల షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులు, తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ చానెళ్ల నిర్వాహకులతో ఆయన చర్చించారు. ‘‘దాదాపు 85 సినిమాలు షూటింగ్‌కు సంబంధించిన వివిధ దశల్లో ఉన్నాయి. షూటింగ్‌లకు అనుమతులు ఇస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది. షూటింగ్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను తప్పక పాటిస్తాం’’ అని ఈ సమావేశంలో పాల్గొన్నవారు తలసానికి చెప్పారు. ‘‘సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ షూటింగ్ ప్రదేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, థియేటర్స్‌ను తెరచిన తర్వాతి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు తలసాని. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీమోహన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రామ్మోహనరావు, ‘మా’ అధ్యక్షుడు నరేష్, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’రాజు, సురేందర్‌రెడ్డి, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్స్ ఎన్.శంకర్‌లతో పాటుగా టీవీ చానెళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. -
టాలెంట్ అన్లిమిటెడ్
అవకాశం రావాలే కానీ... ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు సిటీ కుర్రకారు. కలర్స ఎంటర్టైన్మెంట్ చానల్ మెహదీపట్నం సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్‌లో తమ టాలెంట్‌తో అదరగొట్టి అబ్బురపరిచారు. ‘ఇండియా గాట్ ట్యాలెంట్’ అనే ఈ రియాల్టీ షోలో దుమ్ము రేపారు. రియాల్టీ షో హోస్ట్ నకుల్ మెహతా, బిగ్‌బాస్ సీజన్8 ఫైనలిస్ట్ ప్రీతమ్ సింగ్ యూత్ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సిటీ కుర్రాళ్లే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సిటీ ‘నిధి’ ఆడిషన్స్‌లో బోయినపల్లికి చెందిన పదేళ్ల చిన్నారి జి.నిధి ప్రత్యేక ఆకర్షణ. కూచిపూడితో పాటు జానపద గీతాలకు అలవోకగా నృత్యం చేసి అబ్బురపరిచింది నిధి. భవిష్యత్‌లో మంచి యాక్టర్ అవ్వాలనేది ఈ చిన్నారి ఆకాంక్ష. మా అమ్మాయి 21 లాలిపాటలను ఏకధాటిగా పాడి తెలుగు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడు రికార్డులు తిరగరాసింది. కళాకారిణి కావాలన్న నా కోరిక నా బిడ్డ తీర్చింది... అంటూ ఆనందంగా చెప్పారు నిధి తల్లి స్వర్ణశ్రీ. మహరాష్ర్ట బీడ్ ప్రాంతం నుంచి వచ్చాం. మా అమ్మాయి సలోని (11)కి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. మహరాష్ట్ర దూరదర్శన్‌లో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో తనే విన్నర్. ప్రస్తుతం ‘అస్త్ర’ అనే మరాఠి చిత్రంలో నటిస్తోంది. ఈ షోలో కూడా అదరగొడుతుందని నమ్మకం ఉంది... అని వైష్ణవి చెప్పారు. కొదవ లేదు... ఈ టాలెంట్ హంట్‌లో పాల్గొనేవారిని ఉత్తేజపరచడానికి వచ్చాను. కంటెస్టెంట్ల ప్రదర్శన మైండ్ బ్లోయింగ్. వారిని చూస్తుంటే నాకే ప్రేరణ కలుగుతుంది... అన్నారు నకుల్ మెహతా. హైదరాబాద్‌లో టాలెంటెడ్ యూత్‌కి కొదవలేదని ప్రీతమ్‌సింగ్ చెప్పారు. - ఎస్.శ్రావణ్‌జయ