టాలెంట్ అన్‌లిమిటెడ్
అవకాశం రావాలే కానీ... ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు సిటీ కుర్రకారు. కలర్‌స ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ మెహదీపట్నం సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్‌లో తమ టాలెంట్‌తో అదరగొట్టి అబ్బురపరిచారు. ‘ఇండియా గాట్ ట్యాలెంట్’ అనే ఈ రియాల్టీ షోలో దుమ్ము రేపారు. రియాల్టీ షో హోస్ట్ నకుల్ మెహతా, బిగ్‌బాస్ సీజన్8 ఫైనలిస్ట్ ప్రీతమ్ సింగ్ యూత్ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సిటీ కుర్రాళ్లే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు.
సిటీ ‘నిధి’
ఆడిషన్స్‌లో బోయినపల్లికి చెందిన పదేళ్ల చిన్నారి జి.నిధి ప్రత్యేక ఆకర్షణ. కూచిపూడితో పాటు జానపద గీతాలకు అలవోకగా నృత్యం చేసి అబ్బురపరిచింది నిధి. భవిష్యత్‌లో మంచి యాక్టర్ అవ్వాలనేది ఈ చిన్నారి ఆకాంక్ష. మా అమ్మాయి 21 లాలిపాటలను ఏకధాటిగా పాడి తెలుగు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడు రికార్డులు తిరగరాసింది. కళాకారిణి కావాలన్న నా కోరిక నా బిడ్డ తీర్చింది... అంటూ ఆనందంగా చెప్పారు నిధి తల్లి స్వర్ణశ్రీ.
మహరాష్ర్ట బీడ్ ప్రాంతం నుంచి వచ్చాం. మా అమ్మాయి సలోని (11)కి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. మహరాష్ట్ర దూరదర్శన్‌లో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో తనే విన్నర్. ప్రస్తుతం ‘అస్త్ర’ అనే మరాఠి చిత్రంలో నటిస్తోంది. ఈ షోలో కూడా అదరగొడుతుందని నమ్మకం ఉంది... అని వైష్ణవి చెప్పారు.
కొదవ లేదు...
ఈ టాలెంట్ హంట్‌లో పాల్గొనేవారిని ఉత్తేజపరచడానికి వచ్చాను. కంటెస్టెంట్ల ప్రదర్శన మైండ్ బ్లోయింగ్. వారిని చూస్తుంటే నాకే ప్రేరణ కలుగుతుంది... అన్నారు నకుల్ మెహతా. హైదరాబాద్‌లో టాలెంటెడ్ యూత్‌కి కొదవలేదని ప్రీతమ్‌సింగ్ చెప్పారు.
- ఎస్.శ్రావణ్‌జయ