పుస్తక పండుగ వచ్చేస్తోంది..
=7 నుంచి బుక్ ఫెస్టివల్
=ప్రవేశం ఉచితం
=ప్రతీ పుస్తకంపై రాయితీ
పంజగుట్ట,న్యూస్‌లైన్: ఒకటికాదు..రెండుకాదు. వేలాది పుస్తకాలు ఒకేచోట.. చిన్నారులు, పెద్దలు, యువతకు కావాల్సిన అన్నిరకాల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. అంతేకాదు ఒక్కో పుస్తకానికి 10 నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నారు. ప్రతియేటా నగరంలో నిర్వహించే పుస్తకమేళా డిసెంబర్ 7 నుంచి 15 తేదీ వరకు జరగనుంది.
దీనికి సంబంధించిన విషయాలను హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు హన్మంతరావు, పుస్తక మేళా ఆఫీసర్ ఇన్ఛార్జ్ డా.పత్తిపాక మోహన్లతో కలిసి నేషనల్ బుక్ ట్రస్ట్ డెరైక్టర్ సికందర్ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి మేళా పీపుల్స్‌ప్లాజాలో కాకుండా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల వరకు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, మేళాలో విక్రయించే ప్రతీ పుస్తకంపై పదిశాతం రాయితీ ఉంటుందని, ఆంగ్లభాష కాకుండా అన్ని భారతీయ భాషల్లో పుస్తకాలు అమ్మే స్టాళ్లకు యాభైశాతం ప్రత్యేకరాయితీ ఉంటుందన్నారు.
మొత్తం 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని,ప్రదర్శనలో పాల్గొనే ప్రచురణకర్తలు, విక్రేతలు మేళావేదికపై సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరపదల్చుకునే వారు 09811239219, లేదా www.nbtindia.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు.