‘రజనీ’ రాగచంద్రికలు
బాలాంత్రపు రజనీకాంతరావుగారిపై ‘సాక్షి’ ప్రత్యేక అనుబంధాన్ని (29.1.2015) ఆసాంతం చదివాను. రజనీ వంటి దిగ్గజం గురించి ఇలాంటి అనుబంధాన్ని తీసుకురావడం అనే ఆలోచనే అద్భుతం. తెలుగు సంగీత కురువృద్ధుడితో ఇంటర్వ్యూను ‘సాక్షి’ చానల్లోనూ చూశాను. ముద్రణా మాధ్యమంలో రజనీగారి బహుముఖ వ్యక్తిత్వాన్ని సమ ర్పించడం, అర్థం చేసుకోవడం కష్టమే అయినా మీరు దాన్ని పూర్వ పక్షం చేశారు. జ్యోతిషశాస్త్రంపై వారికున్న విస్తృత అనుభవాన్ని మనం కోల్పోతున్నామని భావిస్తున్నా.
ఈ సందర్భంగా చిన్న విషయం గుర్తు చేస్తున్నా. కొంతకాలం క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేనూ విజయ వాడలో ఒక హోటల్లో కలుసుకున్నప్పుడు రజనీగారు ఎలా ఉన్నారని ఆయన యథాలాపంగా నన్నడిగారు. ఆయన బాగున్నారని, కలవాలం టే ఎస్పీబీ బస చేసిన హోటల్ వద్దకు ఆయన్ను తీసుకొస్తానని చెప్పా ను. ఎస్పీబీ నన్ను కోప్పడ్డారు. రజనీ వద్దకు బాలు స్వయంగా వెళ్లాలి కాని తద్విరుద్ధంగా కాదని సరిదిద్దారు. పైగా, వారి పాదాల చెంత కూర్చోవడానికి కూడా మనకు అర్హత లేదని ముక్తాయించారు. అదీ రజనీ మూర్తిమత్వం అంటే. ఆ మేధోమేరువును, ఆయన గొప్ప తనాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చినందుకు, తెలుగు పాఠకులకు పరిచయం చేసినందుకు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఎంవీఎస్ ప్రసాద్
అత్తాపూర్, హైదరాబాద్