'టెక్నాలజీలకు ప్రాధాన్యం'
పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు ప్రాధాన్యం: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ అనుకూల టెక్నాలజీలను అన్ని రంగాల్లో చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ బయోప్లాంటును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్వీకరించింది. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, సేంద్రీయ పదార్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుందన్నారు. సీసీఎంబీ లాంటి పరిశోధన సంస్థలు ఇలాంటి టెక్నాలజీలను వాడేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ వై.నగేశ్ కుమార్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహన్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.