ప్రతి నీటిబొట్టునూ దాచుకుందాం
- ‘మన్ కీ బాత్’లో మోదీ
- జబ్బుల్లేని జీవితం కావాలంటే యోగా చేయాలి
- పారదర్శకతను పెంచి నల్లధనానికి అడ్డుకట్ట వేద్దాం
న్యూఢిల్లీ: పర్యావరణ క్షీణత వల్లే తీవ్ర వడగాడ్పులు, కరువు తాండవిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే అడవులను పరిరక్షించాలని, రానున్న వర్షాకాలంలో ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని దేశ పౌరులంతా ఉద్యమంగా చేపట్టాలని ఉద్బోధించారు. ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ ఆదివారం ప్రసంగించారు. ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరువుపై నిర్వహిస్తున్న సమీక్షల గురించి ప్రస్తావిస్తూ.. పలు రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం మంచి చర్యలు చేపట్టాయని కొనియాడారు.
ఇలా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఉత్తమమైన వాటిని గుర్తించాలని నీతి ఆయోగ్‌కు సూచించారు.నగదురహిత సమాజం వైపు అడుగులేయాల్సిన అవసరం గురించి చెబుతూ.. దీనివల్ల పారదర్శకత పెంపొందడంతోపాటు నల్లధనానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. జబ్బుల్లేని జీవితాన్ని హాయిగా గడిపేందుకు దేశ ప్రజలంతా యోగా సాధన చేయాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చండీగఢ్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
► రుతుపవనాలు వారం ఆలస్యమ వుతాయనగానే అందరిలో ఆందోళన నెలకొంది. చాలా రాష్ట్రాలు తీవ్ర వడగాడ్పులను అనుభవించాయి. మనుషులతోపాటు పశుపక్ష్యాదులు ఇబ్బందుల్లో పడ్డారు. దీనికంతటికీ కారణం పర్యావరణ క్షీణత.
సచెట్లు నరికేస్తున్నారు. మానవాళి పర్యావరణాన్ని నాశనం చేస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలో కార్చిచ్చు రగలడానికి కారణం ఎండిన ఆకులు.. స్వల్ప నిర్లక్ష్యం. రానున్న వర్షాకాలంలో ఎవరూ కూడా ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా ఆదా చేయాలి. జలం.. దైవ ప్రసాదంతో సమానం. వచ్చే 4 నెలల్లో దేశప్రజలంతా ‘సేవ్ వాటర్ అభియాన్’ను భారీ ఉద్యమంగా చేపట్టాలి. వర్షాకాలంలో నీటిని వృథా చేస్తే తరువాత మనమే బాధపడాలి.
► ఏపీ, తెలంగాణ, యూపీ, రాజస్తాన్, గుజరాత్ వంటి కరువు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిననప్పుడు నీటి కొరత గురించి చెప్పారు. సీఎంలతో ఉమ్మడి సమావేశం నిర్వహించే పాత సంప్రదాయానికి స్వస్తి పలికి ఒక్కో సీఎంతో విడిగా సమావేశమవ్వాలని నిర్ణయించా. దీనివల్ల ఒక్కొక్కరూ చెప్పే అంశాలను సావధానంగా వినొచ్చు. దీంతో నేనెంతగానో నేర్చుకున్నా.
► యూపీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాలు నీటి పొదుపు కోసం సూక్ష్మ నీటిపారుదల, డ్రిప్ ఇరిగేషన్, ఇంకుడు గుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం అంటూ పలు చర్యలు చేపట్టాయి. ఏపీ, గుజరాత్ రాష్ట్రాలు నీటి కరువును సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుర్కొన్నాయి.
► త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులను అంతా ప్రోత్సహించాలి. గెలుపోటములు ముఖ్యం కాదు.. స్ఫూర్తి ప్రధానం.
► అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలున్నప్పటికీ సీఎం అభ్యర్థి, కేంద్ర క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్.. పాటియాలాలోని క్రీడా కేంద్రంలో ఒలింపిక్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం చేసిన ఏర్పాట్ల పరిశీలన కోసం వెళ్లడం నన్నెంతగానో ఆకట్టుకుంది.
కాగా, ‘మన్ కీ బాత్’ను వినలేకపోయిన వారు 1922 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వినొచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఇరాన్‌కు చేరుకున్న మోదీ
టెహ్రాన్: వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ ఆదివారం ఇరాన్‌కు చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో మోదీ వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ పోర్ట్ అభివృద్ధిపై తుది ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. గత 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్‌కు రావడం ఇదే తొలిసారి. ఆదివారం ఇక్కడి మెహ్రాబాద్ విమానాశ్రయంలో దిగిన మోదీకి ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ తయేబ్నియా ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ స్థానిక గురుద్వారాకు వెళ్లి భారత సంతతి ప్రజలను కలిశారు. సోమవారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయి చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం మోదీకి రౌహానీ విందు ఇస్తారు. ఆ దేశ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోనూ మోదీ సమావేశమవుతారు.
‘ఇరుదేశాల మధ్య అనుసంధానతను పెంచడం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భాగస్వామ్యం, ప్రజల మధ్య మెరుగైన సంబంధాలు, సాంస్కృతిక అంశాలు మా ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రౌహానీ, ఖమేనీలతో భేటీ దోహదపడుతుందన్నారు. ఛబహర్ పోర్ట్ ఒప్పందం ద్వారా ఇంధన దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉండే చబహర్ పోర్టు నుంచి భారత పశ్చిమ తీరానికి రవాణా సులువుగా ఉంటుంది. 2003లో ఈ పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. జనవరిలో ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి పోర్టు ఒప్పందం కోసం భారత్ యత్నిస్తోంది.