అమరావతిపై ప్రధాని మోదీకి కేవీపీ లేఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాలను అంచనా వేయకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. పర్యావరణ మదింపు కమిటీ పరిశీలన లేకుండానే ఎస్ఐఇఇఎఎ అనుమతులు ఇవ్వడం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడమేనని చెప్పారు. ఆదివారం ఆయన ఏపీ రాజధాని అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాని నరేందర్ మోదీకి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. హడావుడిగా చేసే తాత్కాలిక రాజధాని నిర్మాణం వల్ల భారీగా ప్రజాధనం వృధా అవుతుందని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, నిర్మాణాల విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేవీపీ లేఖలో తెలిపారు.