అన్నదాతల్లో ఆందోళన
ముఖం చాటేసిన వరుణుడు
ఎండుతున్న పంటలు
తూర్పులో ఓ మోస్తరు వానలు..
పశ్చిమలో వర్షాభావం
సగం మండలాల్లో పంటలు అంతంతే
హన్మకొండ : వరుణుడు ముఖం చాటేశాడు. అన్నదాతలు ఆందోళనగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలకు కొదువ ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు ఊ(హి)రించారు. అయితే జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురవగా, పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు రైతులను పట్టి పీడిస్తున్నాయి. తొలకరి జల్లులతో దుక్కులు చేసిన రైతులు, అనంతరం కురిసిన వర్షాలతో విత్తనాలు వేశారు. జూన్‌లో అడపా దడపా వర్షాలు కురవగా, జూలై నెల రైతుల్లో ఆశలు రేకెత్తిం చింది. దీంతో ఇక పంటలకు ఇబ్బంది లేదని భావించారు. అయితే ఆగస్టులో వరుణుడు ముఖం చాటేయడంతో వారి ఆశలు ఆవిరయ్యా యి. ఈనెల 2, 3 తేదీలలో జిల్లా అంతటా వర్షం కురిసింది. ఇక అదే చివరిది. ఆ తర్వాత తూర్పు ప్రాం తంలోని పది మండలాల్లో మరో రెండు రోజులు వర్షం కురిసినా.. 20 రోజులుగా చుక్కనీరు పడలేదు. దీంతో జిల్లాలో మెట్ట పంటలు ఎండుతున్నాయి. ప్రధానంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, మహబూబాబాద్, వర్థన్నపేటతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలోని సగం మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో జూన్‌లో ప్రాంతాల వారీగా 5 నుంచి 10 రోజులు, ఆగస్టులో సగటున 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. జూలైలో వర్షాలు పడినా అన్ని ప్రాంతాల్లో కురువలేదు.
ఎండిన విత్తనాలు..
జూలై నెలలో వరుణుడు ఆశలు రేకెత్తించడంతో రైతులు విత్తనాలు వే శారు. అయితే ఆ తర్వాత వర్షాలు లేక అవి ఎండిపోతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న దెబ్బ తింటోంది. ఈ నెలాఖరు వరకు కూడా పరి స్థితి ఇలాగే ఉంటే ఇక ఆశ వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 50,015 హెక్టార్లలో మొక్కజొ న్న వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి వేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో రైతులు మొక్కజొన్నపై దృష్టి పెట్టారు. గ త ఖరీఫ్‌లో 43,260 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తే, ఈ ఖరీఫ్ లో 58,848 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షా లు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. వాతావరణ శాస్త్రజ్ఞులు వ ర్షా లు పడుతాయని చెప్పడంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ ఆ ఆశ లు ఎంతోకాలం నిలువలేదు. వర్షాలు లేక భూగర్భ జలాలు సైతం అ డుగంటయ్యాయి. దీంతో వరినాట్లు ఆశించిన మేర వేయలేదు. కొడకండ్ల, నర్సింహులపేట, డోర్నకల్, కురవి, బచ్చన్నపేట, మద్దూరు, చే ర్యాల, జనగామ, రఘునాథపల్లి తదితర మండలాల్లో వరినాట్లు అం తంత మాత్రమే వేశారు. వరి నాటు వేసినా భూగర్భ జలాలు లేక పం టలు ఎండిపోతున్నాయి. వరి పొలాలు నెర్రెలువారాయి. ఈ ఖరీ ఫ్లో 1,36,245 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించినా ఇప్పటి వరకు 91 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. మరో 2900 హెక్టార్లలో నారు సిద్ధంగా ఉంది. కానీ సరిపడా నీరులేక నారు ఎండిపోతోంది. కురవి తదితర మండలాల్లో మిరప పంట పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు బిందెలతో నీరు పోసి మెుక్కలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.