ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
భువనగిరి: విధి నిర్వహణలో అలసత్వం.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగంతో భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈఓపీఆర్డీ వెంకటనర్సయ్య, కూనూరు పంచాయతీ కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల పంచాయతీ కార్యదర్శి ఎం.నాగరాజులపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీపీఓ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీపరిధిలోని కూనూరు, చందుపట్ల గ్రామాల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా 54 ఎకరాల వెంచర్‌ను రియల్ఎస్టేట్ వ్యాపారులు చేశారు. అయితే నిబంధ నలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ల హద్దురాళ్లు తొలగించాలని ఇచ్చిన అదేశాలను పంచాయతీ కార్యదర్శులు అమలుచేయలేదు.
రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినందునే వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అరోపణలు వచ్చాయి. దీంతో డీపీఓ ప్రభాకర్‌రెడ్డి ఈ నెల23 న చందుపట్ల గ్రామానికి వచ్చి స్వయంగా వెంచర్లపై విచారణ జరిపారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తేల డంతో, ఈఓ పీఆర్డీ, ఇద్దరు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేశారు.
అక్రమాలకు నిలయంగా..
భువనగిరి ఎంపీడీఓ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారిందని మరో మారు రుజువైంది. ముఖ్యమంత్రి స్వయంగా అక్రమ లేఅవుట్లపై కొరడ ఝలిపించాలని కోరుతుంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మాత్రం చేతివాటం చూపుతూనే ఉన్నారు. మండలంలో దీర్ఘ కాలికంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచి పంచాయతీ కార్యదర్శులుగా ఇక్కడే ఉంటున్న వారు అధికారులను మెప్పించి తమకు అనుకూలమైన గ్రామాలకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. సస్షెన్షన్కు గురైన నాగరాజు వడపర్తిలో పర్మనెంట్ పోస్ట్ ఉండగా అదనంగా చందుపట్ల, ముస్త్యాలపల్లితో పాటు ఇటీవల రాయగిరి గ్రామ పంచాయతీని బలవంతంగా తీసుకున్నారు.
రాయగిరిలో పనిచేస్తున్న కార్యదర్శిని అక్కడి విధుల్లోంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంద్రసేనారెడ్డి కూడా కూనురు, అనాజిపురం, బండసోమారం గ్రామాలకు కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గ్రామాల్లో అక్రమ ఆదాయం దండిగా వస్తుందనే కారణంతో ఈ కార్యదర్శుల విధుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విధులను నిర్లక్ష్యం చేయడంతో పాటు స్థానిక గ్రామపంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు పడనున్నట్టు సమాచారం.