కాసుపుస్తకం
- రెవెన్యూకు అవినీతి జబ్బు
- తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న వైనం
- పాస్‌పుస్తకాల జారీలో లొసుగులతో కాసుల పంట
- ఆర్జీదారులకు తప్పని ఇబ్బందులు
- ప్రక్రియలో కానరాని పారదర్శకత
మొన్న పాస్‌పుస్తకాల ముద్రణ.. నిన్న యూనిక్‌కోడ్... నేడు ఈ-పాస్‌పుస్తకాలు... ఇవీ పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో తీవ్ర జాప్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు. ఇలా ఎన్ని తీసుకొస్తున్నా రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం రైతులను ముప్పుతిప్పలు పెట్టడం పరిపాటవుతోంది. విసిగిపోయిన అన్నదాతలు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించడం, వారు దాడులు చేపట్టడం ఇందుకు నిదర్శనం.
యలమంచిలి: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో లొసుగులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. పాస్‌పుస్తకం కావాలంటే నిన్నటి వరకు తహశీల్దార్‌కు ఆర్జీపెట్టుకుని అధికారుల కరుణ లభించే వరకు కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వచ్చేది.
ఇప్పుడు కొత్త విధానంలో ఈ-పాస్‌పుస్తకాలను మీ-సేవా కేంద్రాల ద్వారా జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలోనే పలువురు వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు రైతులు, ఆర్జీదారుల నుంచి లంచాలు భారీగా వసూలు చేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో ముగ్గురు వీఆర్వోలు, తాజాగా సోమవారం భీమునిపట్నం తహశీల్దార్ అవినీతి నిరోధక శాఖాధికారులకు ఇదే విషయంలో పట్టుబడ్డారు. ఇలా ఏసీబీ అధికారులకు పట్టుబడినవారు కొందరేనని, దాదాపుగా అవినీతి జబ్బు అన్ని రెవెన్యూ కార్యాలయాల్లోనూ సాగుతోందన్న వాదన ఉంది. మీ-సేవా కేంద్రాల రాకతో రెవెన్యూ శాఖలో అనూహ్య సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి.
మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల జారీ తగ్గిపోయింది. తాజాగా పట్టాదారు పాస్‌పుస్తకాలను సైతం మీ-సేవాల ద్వారానే జారీకి సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేసి రెవెన్యూ రికార్డుల మేరకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధారణంగా ఒక రైతు భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఆ వివరాలు వన్‌బీ రికార్డుల్లో నమోదవ్వాలి. అదే విధంగా విక్రయదారుని పేరుమీద అడంగల్ తప్పనిసరి. కొనుగోలుదారు కూడా వెంటనే రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం రెవెన్యూ శాఖ ‘వెబ్‌ల్యాండ్’ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించి పాస్‌పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టింది.
ఇంత చేస్తున్నా పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియలో ఎడతెగని జాప్యం తప్పడం లేదు. ఈ మొత్తం ప్రక్రియలో లొసుగులను అడ్డం పెట్టుకుంటున్న రెవెన్యూ యంత్రాంగానికి పాస్‌పుస్తకాల జారీ కాసుల పంట పండిస్తోంది. కొందరు అధికారులు రైతులను తమ కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో భారీగా లంచాలను డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి రావడంతో పనులు కోల్పోతున్నామనే భావనతో ఆర్జీదారులు రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఇదే అదునుగా కొందరు రెవెన్యూ అధికారులు ఆర్జీదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో విసుగు చెందిన ఆర్జీదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
భూ విస్తీర్ణం నమోదుకు రెండేళ్లు తిప్పారు
పట్టాదారు పాస్‌పుస్తకాలతోపాటు చాలా పనులకు ఆర్జీదారులను కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పించుకోవడం ద్వారా రెవెన్యూ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి నిరుపేదలనూ అవస్థలకు గురిచేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో భూ విస్తీర్ణం నమోదుకు రెండేళ్ల పాటు నన్ను రెవెన్యూ అధికారులు తిప్పించుకున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ దృష్టికి రెండుసార్లు, పత్రికల ద్వారా నా ఇబ్బంది చెప్పుకుంటే గాని పని జరగలేదు. -పాల అప్పారావు, రైతు, యలమంచిలి
రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి
రెవెన్యూ కార్యాలయాల్లో పనులు కావాలంటే సొమ్ములు ముట్టజెప్పాల్సిందే. చాలా కాలంగా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న రెవెన్యూ సిబ్బంది తీరే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అవినీతికి అవకాశం లేకుండా పనులు పూర్తయ్యేలా సంస్కరణలు చేపట్టాలి. అలా చేస్తే రైతులంతా ఎంతో సంతోషిస్తారు.
- యల్లపు శ్రీనివాస్, సోమలింగపాలెం, యలమంచిలి