EPC
-
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
ఈపీసీ రంగంలో టెక్ నిపుణులు
ముంబై: నిర్మాణ రంగంలోని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) విభాగంలో టెక్ నిపుణుల నియామకాలు ఊపందుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఈ రంగంలోని సంస్థలు నిలకడగా టెక్నాలజీ ప్రమాణాల పెంపు(అప్‌గ్రెడేషన్)ను చేపడుతుండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ నివేదిక తెలియజేసింది. ‘దేశ ఈపీసీ రంగంలో నేటి ఉపాధి ధోరణి(ట్రెండ్)–2023 ఫిబ్రవరి’ పేరిట రూపొందించిన నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. 2023 బడ్జెట్ నేపథ్యంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఈపీసీ రంగంలో టెక్ నిపుణులకు డిమాండును పెంచినట్లు పేర్కొంది. అటు అత్యుత్తమ స్థాయి యాజమాన్యం, ఇటు కొత్తవారికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు తెలియజేసింది. టెక్నాలజీయేతరాల్లో.. నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్(2,367 ఉద్యోగాలు) తదుపరి టెక్నాలజీయేతర రంగాలలో ఈపీసీ 11 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. ఆపై బ్యాంకింగ్ 10 శాతం, ఎఫ్ఎంసీజీ రంగం 3 శాతం, ఫార్మా 2 శాతం చొప్పున నిలుస్తున్నాయి. ఈ నివేదికను సీఐఈఎల్ హెచ్ఆర్ 80,000 మందికి ఉపాధి కల్పించిన 52 ఈపీసీ కంపెనీలపై చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించింది. 2023 జాబ్ పోర్టళ్లలో నమోదు చేసిన 21,865 ఉద్యోగాలనూ విశ్లేషణకు పరిగణించింది. ఈపీసీ కంపెనీలు సాంకేతికతలను నిరంతరంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్లు, జావా డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు, ఇంటెగ్రేషన్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ నిపుణుల ఎంపికలో బెంగళూరు( 19 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్(18 శాతం) టాప్ ర్యాంకులో నిలిచాయి. కార్యకలాపాల డిజిటైజేషన్, సామర్థ్యం, కస్టమర్ సేవల మెరుగు తదితరాల కోసం ఈపీసీ కంపెనీలు ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయి. మౌలికాభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి కారణంగా ఈ రంగం వేగవంతంగా విస్తరించనున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. దీంతో గతంలోలేని విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
బీజీఆర్ ఎనర్జీ చేతికి ఏపీ పవర్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు
రూ.650 కోట్ల ఆర్డర్లు చెన్నై: ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) దిగ్గజం బీజీఆర్ ఎనర్జీ, వాటర్ ట్రీట్మెంట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. రూ.650 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి రూ.210 కోట్ల ఆర్డర్‌ను సాధించామని బీజీఆర్ ఎనర్జీ తెలిపింది. ఈ ఆర్డర్లో భాగంగా 800 మెగావాట్ల మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇక చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నుంచి రూ.440 కోట్ల ఆర్డర్‌ను పొందామని పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా చెన్నై సమీపంలోని కొడంగైయ్యూర్లో రోజుకు 45 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న టెర్షియరీ ట్రీట్మెంట్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ రెండు ఆర్డర్లతో తమ ఆర్డర్ల బుక్ విలువ రూ.10,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఆర్డర్ల నేపథ్యంలో బీఎస్ఈలో బీజీఆర్ ఎనర్జీ షేర్ 7 శాతం వృద్ధితో రూ.125కు ఎగసింది.