వర్సిటీలో ఆత్మహత్యలు నివారిస్తాం
గుడివాడ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇకపై ఏవిధమైన ఆత్మహత్యలు జరగకుండా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ బి.ఉదయలక్ష్మి అన్నారు. స్థానిక కేటీఆర్ మహిళా కళాశాలలో సోమవారం నిర్వహించిన ఎన్విరాన్మెంట్ స్టడీస్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యాజమాన్యం మధ్య సరైన సంబంధాలు లేకపోవడం వలనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. యూనివర్సిటీలోకి కొంతమంది బయట వ్యక్తులు రావడం వలన ర్యాగింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలో ఇప్పటికే పలుమార్పులు తెచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే యూనివర్సిటీ చుట్టూ సోలార్ విద్యుత్‌తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థినులు, మహిళలు రాగింగ్ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టి దాని ద్వారా ఆకతాయిల చేష్టలను కట్టడి చేస్తున్నామన్నారు.
మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించి రాగింగ్‌పై ఉన్న భయాన్ని పోగొడతామన్నారు. యూజీసీ నిధులతో యూనివర్సిటీలో రూ.2.5 కోట్లతో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్స్‌లో ఏవిధమైన అవకతవకలు జరగకుండా ఉండేందుకు అటెండెన్స్ విషయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.బి.సుజాత, ఏఎన్నార్ కాలేజి ప్రిన్సిపాల్ ఎస్.శంకర్ పాల్గొన్నారు.