చీలిన ఎస్ఎంకే
* మరో ఎంఎస్కే ఆవిర్భావం
* కమిటీ ప్రకటించిన ఎర్నావూర్
* అమ్మకు మద్దతుగా ప్రచారం
* శరత్‌కు ప్రత్యర్థిగా బరిలోకి
సాక్షి, చెన్నై : అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి చీలింది. కొత్తగా శుక్రవారం సమత్తువ మక్కల్ కళగం ఆవిర్భవించింది. శరత్‌కుమార్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు తాను సిద్ధం అని ఎర్నావూర్ నారాయణన్ ప్రకటించారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో నాడార్ సామాజిక వర్గ అభ్యున్నతి లక్ష్యంగా అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) ఆవిర్భవించి ఉన్న విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో అన్నాడీఎంకే చిహ్నంతో ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎర్నావూర్ నారాయణన్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తాజాగా, శరత్‌కుమార్, నారాయణన్‌ల మధ్య బయలు దేరిన వివాదంతో ఆపార్టీ చీలిక దిశగా పయనం సాగింది. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు శరత్‌కుమార్ ప్రకటించడంతో, ఇక తాను మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ విధేయుడ్నే అని నారాయణన్ స్పష్టం చేశారు. అలాగే, ఎస్‌ఎంకేను కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, సాధ్య పడకపోవడంతో చివరకు ఎస్‌ఎంకేను చీల్చడంతో పాటుగా శరత్‌కుమార్‌ను ఇరకాటంలో పెట్టే విధంగా ఎస్ఎంకే నినాదంతో కొత్త పార్టీని ప్రకటించారు.
కొత్త పార్టీ : సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)ని ఇరకాటంలో పెట్టే విధంగా సమత్తువ మక్కల్ కళగం(ఎస్ఎంకే) నినాదంతో ఎర్నావూర్ నారాయణన్ తన పార్టీని ప్రకటించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీ ప్రకటనతో పాటుగా హిందూ, ముస్లీం, క్రైస్తవ ఐక్యతను చాటే రీతిలో జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు, మధ్యలో తెలుపు వర్ణంతో వలయాకారం, మధ్యలో పిరమిడ్‌ను తలపించే గుర్తును పొందు పరిచారు. అనంతరం ఎర్నావూర్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, కొత్త కమిటీని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా ఎర్నావూర్ నారాయణన్, ప్రధాన కార్యదర్శిగా సూలూరు టీఆర్ చంద్ర శేఖరన్, కోశాధికారిగా కన్నన్, ఉపాధ్యక్షుడిగా ధనుస్కోడి, సంయుక్త కార్యదర్శిగా టీ.వినాయక మూర్తి, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా తంగముత్తు, రాజకీయ సలహాదారుగా ఎస్ గణేషన్ వ్యవహరించనున్నారు.
అలాగే, రాష్ట్రంలోని 32 జిల్లాలకు కార్యదర్శుల్ని ప్రకటించారు. యువజన కార్యదర్శిగా ఎస్ రవి, కార్మిక కార్యదర్శిగా ఎస్ జబరాజ్లను నియమించారు. కొత్త పార్టీ ప్రకటనతో ఒకటి రెండు రోజుల్లో అమ్మ జయలలితను కలవనున్నాట్టు తెలిపారు. వాస్తవం, శ్రమ తారక మంత్రంగా నినాదాన్ని అందుకుని ముందుకు సాగనున్నామని పేర్కొన్నారు. అన్నాడిఎంకేకు శరత్‌కుమార్ తీవ్ర ద్రోహం చేశారని, ఎస్‌ఎంకేను అడ్డం పెట్టుకుని ఆయన సాగించిన అవినీతికి హద్దేలేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ చిట్టా విప్పారు. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్ ఎక్కడ పోటీ చేసినా సరే , ప్రత్యర్థిగా అమ్మ ఆజ్ఞతో బరిలో దిగడానికి తాను సిద్ధమని ప్రకటించారు.