తుపాన్ వేళ ఏపీ మంత్రుల తీరు సరికాదు
సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ
ఐదు నక్షత్రాల హోటళ్లలో బసేంటి?.. డిమాండ్లేంటి?
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేయటాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తప్పు పట్టారు. దీనిపై ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల ఓ లేఖ రాశారు.
ఒకపక్క జనం నిత్యావసరాల కోసం అల్లాడుతుంటే మరోపక్క ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసిన మంత్రులు తొలుత ఆ హోటళ్లకు నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపైన తీవ్ర ఒత్తిడి తెచ్చారని లేఖలో శర్మ పేర్కొన్నారు. ఆసుపత్రులు, మురికివాడలు, సామాన్య ప్రజలకు మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు తాము బస చేసిన ఐదు నక్షత్రాల హోటళ్లకు తొలుత ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు.