ఈఎస్ఐ మెడికల్ కాలేజీల బాధ్యత ఇక రాష్ట్రాలకే
తిరువనంతపురం: ఈఎస్ఐ వైద్య కళాశాలలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేందుకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారమిక్కడ వెల్లడించారు. ఒక్కో కళాశాల నిర్వహణకు ఏటా రూ.80 కోట్ల వరకు ఖర్చవుతోందని, ఆ మొత్తాన్ని ఇకపై కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించనున్నట్లు వివరించారు.
ఇప్పటికే నిర్మాణ ంలో ఉన్న కొల్లంలోని ఈఎస్ఐ కళాశాలను కేరళ ప్రభుత్వానికి అప్పగించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. వారు వీటితో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందే వీలుంటుందని తెలిపారు. కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు జాతీయ వృత్తి నైపుణ్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.