esophageal reflux disease
-
అన్న వాహిక అమర్చి.. ఆకలి తీర్చి
లక్డీకాపూల్: ఆ ఇద్దరు చిన్నారులు అన్నవాహిక లోపంతో పుట్టారు. తినాలన్నా, తాగాలన్నా అలవికాని పరిస్థితి. తిరగని డాక్టర్ లేడు. చిన్నారులకి ఆకలి బాధ... ఆహారం తీసుకోలేక అలమటిస్తున్న పిల్లలను చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. పిల్లల, తల్లిదండ్రుల వేదనకు అంతం పలికారు నిమ్స్ వైద్యులు. శస్త్రచికిత్సతో వారిద్దరూ ఆహారం తీసుకునేలా చేశారు. ఏళ్ల తరువాత కడుపునిండా తినగలుగుతున్నారా చిన్నారులు. వివరాల్లోకి వెళ్ళితే.. విశాఖపట్టణానికి చెందిన మేళ్ల కాశీరామ్ కొడుకు కోదండరామ్ (2)అన్న వాహిక లోపంతో పుట్టాడు. ఫుడ్ పైప్ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో పాటు, ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది. దీంతో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. అక్కడి వైద్యులు తాత్కాలికంగా కడుపులోకి పైపు వేసి ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. పెద్ద పేగుకు సంబంధించి మెడ భాగంలో హోల్ వేశారు. దాంతో ఆ బాబు ఏం తాగినా వెంటనే బయటకి వచ్చేసేది. అల్లాడిపోయిన అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. చివరికి నిమ్స్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అన్నవాహిక అట్రేసియా సమస్యతో బాధపడుతున్న బాబుని గత నెల 29న నిమ్స్‌లో చేర్పించారు. ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.50 లక్షలను మంజూరు చేసింది. వ్యాధి నిర్ధారణ అనంతరం సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు... ఈ నెల 5న శస్త్ర చికిత్స చేసి కృత్రిమ అన్నవాహికను అమర్చారు. పెద్ద పేగును ఒక రక్తనాళం మీదుగా తీసుకుని, అది కూడా పొట్ట కిద నుంచి ఏర్పాటు చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాలుడు కోదండరావు ఈ నెల 15వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన మూడున్నరేళ్ల బండి నిష్విత కూడా ఇదే తరహా సమస్యతో సతమతమవుతోంది. ఆమె తండ్రి బి.కృష్ణ రోజువారీ కూలీ. పాపను ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు తాత్కాలికంగా పైపు అమర్చి, ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. అయినా వెక్టరల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్న నిష్వితను మే 5వ తేదీన నిమ్స్‌లో చేర్చారు. మే 10న శస్త్ర చికిత్స ద్వారా ఆమెకు అన్నవాహికను అమర్చారు. ఆ తర్వాత అదే నెల 18న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయినా... రెండు నెలలపాటు వైద్యులు అబ్జర్వేషన్లో పెట్టారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలైంది. ఆ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది.. నిష్విత, కోదండరామ్‌ల ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడింది. వాస్తవానికి అన్నవాహిక సమస్యతో పుట్టిన ఇద్దరు చిన్నారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన తాత్కాలిక చికిత్సతో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడగలిగారు. టెక్నికల్లీ డిమాండింగ్ సర్జరీ కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నాం. వైద్య సిబ్బంది సహకారంతో రెండు ఆపరేషన్లు విజయవంతంగా చేయగలిగాం. ఇరువురికి కృత్రిమ అన్నవాహికను అమర్చి పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిదిద్దాం. ఈ చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత రెండు కుటుంబాలకూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించాయి. ఇప్పడా చిన్నారులు కావాల్సింది తృప్తిగా తినగలుగుతున్నారు. తాగగలుగుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, నిమ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. – డాక్టర్‘‘ ఎన్.బీరప్ప, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...
డాక్టర్ సలహా నా వయసు 30. సమయానికి భోజనం చేయడం కుదరదు. ఈ మధ్య తరచూ గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. రెండు నెలలుగా గొంతులో మార్పులు వచ్చాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్య ఏమిటో తెలియడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని తెలుపగలరు. - ఎస్. వికాస్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి పరిశీలిస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అనిపిస్తోంది. మన ఆహారపుటలవాట్లు, సమయ నియంత్రణ, మారుతున్న జీవనవిధానాల వల్ల చాలామందిలో ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఆహారం జీర్ణం అయ్యే పక్రియలో ఉపయోగపడే ఆమ్లాలు అవసరానికి మించి ఉత్పత్తి కావడం, అవి పైకి ఉబికి గొంతు భాగంలోకి రావడం జరుగుతుంది. ఇది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఈ కింది లక్షణాలను ఒకసారి గమనించండి ఉదయం నిద్రలేవగానే నోటిలో ఏదో చేదుగా అనిపించడం ఛాతీలో మంట పొడిదగ్గు భోజనం తర్వాత, లేదా పడుకున్న తర్వాత దగ్గు గొంతులో నుంచి కఫం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం అలసట త్రేన్పులు రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక స్వరంలో మార్పులు, గొంతులో నొప్పి లేదా మంట మింగడంలో ఇబ్బందులు. పై లక్షణాల్లో ఏదైనా మీకు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ నిపుణులను సంప్రదించండి. వారి సూచన మేరకు గొంతు పరీక్షలు, ఎండోస్కోపీతోపాటు మరికొన్ని పరీక్షలు అవసరం. వారి సూచనల మేరకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ సమస్యకు యాంటీ ఎసిడిటీ మందులతోపాటుగా ఆహార నియమాలను సరిగా పాటించడం చాలా అవసరం. ఉదయం 8 గంటలకు ఉపాహారం మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం రాత్రి 8 గంటలకు భోజనం తీసుకోవాలి. రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. భోజనాన్ని నెమ్మదిగా ఎక్కువసేపు నములుతూ తినాలి. పులుపు, కారం, మసాలా, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, చాక్లెట్లు, కాఫీ, పిప్పరమెంట్లు, ఉల్లిపాయలు వంటివి తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికీ నిద్రకు మధ్య 2-3 గంటల విరామం ఉండాలి. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు