అన్న వాహిక అమర్చి.. ఆకలి తీర్చి | Boy And Girl Born With Esophageal Problem | Sakshi
Sakshi News home page

అన్న వాహిక అమర్చి.. ఆకలి తీర్చి

Published Fri, Jul 29 2022 3:15 AM | Last Updated on Fri, Jul 29 2022 11:18 AM

Boy And Girl Born With Esophageal Problem - Sakshi

ఆపరేష  అనంతరం చిన్నారులు 

లక్డీకాపూల్‌: ఆ ఇద్దరు చిన్నారులు అన్నవాహిక లోపంతో పుట్టారు. తినాలన్నా, తాగాలన్నా అలవికాని పరిస్థితి. తిరగని డాక్టర్‌ లేడు. చిన్నారులకి ఆకలి బాధ... ఆహారం తీసుకోలేక అలమటిస్తున్న పిల్లలను చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. పిల్లల, తల్లిదండ్రుల వేదనకు అంతం పలికారు నిమ్స్‌ వైద్యులు. శస్త్రచికిత్సతో వారిద్దరూ ఆహారం తీసుకునేలా చేశారు. ఏళ్ల తరువాత కడుపునిండా తినగలుగుతున్నారా చిన్నారులు.

 వివరాల్లోకి వెళ్ళితే.. విశాఖపట్టణానికి చెందిన మేళ్ల కాశీరామ్‌ కొడుకు కోదండరామ్‌ (2)అన్న వాహిక లోపంతో పుట్టాడు. ఫుడ్‌ పైప్‌ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో పాటు, ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది. దీంతో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. అక్కడి  వైద్యులు తాత్కాలికంగా కడుపులోకి పైపు వేసి ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. పెద్ద పేగుకు సంబంధించి మెడ భాగంలో హోల్‌ వేశారు.

దాంతో ఆ బాబు ఏం తాగినా వెంటనే బయటకి వచ్చేసేది. అల్లాడిపోయిన అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. చివరికి నిమ్స్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు. అన్నవాహిక అట్రేసియా సమస్యతో బాధపడుతున్న బాబుని గత నెల 29న నిమ్స్‌లో చేర్పించారు. ఏపీ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1.50 లక్షలను మంజూరు చేసింది. వ్యాధి నిర్ధారణ అనంతరం సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు... ఈ నెల 5న శస్త్ర చికిత్స చేసి కృత్రిమ అన్నవాహికను అమర్చారు.

పెద్ద పేగును ఒక రక్తనాళం మీదుగా తీసుకుని, అది కూడా పొట్ట కిద నుంచి ఏర్పాటు చేశారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో బాలుడు కోదండరావు ఈ నెల 15వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల బండి నిష్విత కూడా ఇదే తరహా సమస్యతో సతమతమవుతోంది. ఆమె తండ్రి బి.కృష్ణ రోజువారీ కూలీ. పాపను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

వైద్యులు తాత్కాలికంగా పైపు అమర్చి, ద్రవ పదార్థం అందించే ఏర్పాటు చేశారు. అయినా వెక్టరల్‌ సిండ్రోమ్‌ సమస్యతో బాధపడుతున్న నిష్వితను మే 5వ తేదీన నిమ్స్‌లో చేర్చారు. మే 10న శస్త్ర చికిత్స ద్వారా ఆమెకు అన్నవాహికను అమర్చారు. ఆ తర్వాత అదే నెల 18న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అయినా... రెండు నెలలపాటు వైద్యులు అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలైంది. 

ఆ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది..
నిష్విత, కోదండరామ్‌ల ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడింది. వాస్తవానికి అన్నవాహిక సమస్యతో పుట్టిన ఇద్దరు చిన్నారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన తాత్కాలిక చికిత్సతో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడగలిగారు. టెక్నికల్లీ డిమాండింగ్‌ సర్జరీ కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నాం. వైద్య సిబ్బంది సహకారంతో రెండు ఆపరేషన్లు విజయవంతంగా చేయగలిగాం.

ఇరువురికి కృత్రిమ అన్నవాహికను అమర్చి పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిదిద్దాం. ఈ చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత రెండు కుటుంబాలకూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించాయి. ఇప్పడా చిన్నారులు కావాల్సింది తృప్తిగా తినగలుగుతున్నారు. తాగగలుగుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, నిమ్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు.     
– డాక్టర్‌‘‘ ఎన్‌.బీరప్ప, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి, నిమ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement