ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ... | it is not a throat problem | Sakshi
Sakshi News home page

ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...

Published Mon, May 26 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...

ఇది నేరుగా గొంతు సమస్య కాదు కానీ...

డాక్టర్ సలహా

నా వయసు 30. సమయానికి భోజనం చేయడం కుదరదు. ఈ మధ్య తరచూ గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. రెండు నెలలుగా గొంతులో మార్పులు వచ్చాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్య ఏమిటో తెలియడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని తెలుపగలరు.
 - ఎస్. వికాస్, హైదరాబాద్
 
 మీరు చెప్పిన వివరాలను బట్టి పరిశీలిస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అనిపిస్తోంది. మన ఆహారపుటలవాట్లు, సమయ నియంత్రణ, మారుతున్న జీవనవిధానాల వల్ల చాలామందిలో ఈ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఆహారం జీర్ణం అయ్యే పక్రియలో ఉపయోగపడే ఆమ్లాలు అవసరానికి మించి ఉత్పత్తి కావడం, అవి పైకి ఉబికి గొంతు భాగంలోకి రావడం జరుగుతుంది. ఇది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
 
ఈ కింది లక్షణాలను ఒకసారి గమనించండి

ఉదయం నిద్రలేవగానే నోటిలో ఏదో చేదుగా అనిపించడం  ఛాతీలో మంట  పొడిదగ్గు  భోజనం తర్వాత, లేదా పడుకున్న తర్వాత దగ్గు  గొంతులో నుంచి కఫం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం  అలసట  త్రేన్పులు రావడం  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక  స్వరంలో మార్పులు, గొంతులో నొప్పి లేదా మంట  మింగడంలో ఇబ్బందులు.
 
 పై లక్షణాల్లో ఏదైనా మీకు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ నిపుణులను సంప్రదించండి. వారి సూచన మేరకు గొంతు పరీక్షలు, ఎండోస్కోపీతోపాటు మరికొన్ని పరీక్షలు అవసరం. వారి సూచనల మేరకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ సమస్యకు యాంటీ ఎసిడిటీ మందులతోపాటుగా ఆహార నియమాలను సరిగా పాటించడం చాలా అవసరం.  ఉదయం 8 గంటలకు ఉపాహారం  మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం  రాత్రి 8 గంటలకు భోజనం తీసుకోవాలి. రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. భోజనాన్ని నెమ్మదిగా ఎక్కువసేపు నములుతూ తినాలి. పులుపు, కారం, మసాలా, వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, చాక్లెట్లు, కాఫీ, పిప్పరమెంట్లు, ఉల్లిపాయలు వంటివి తక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనానికీ నిద్రకు మధ్య 2-3 గంటల విరామం ఉండాలి.    
 - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement