మౌలిక వసతుల అధ్యయనానికి కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని నియమించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని నిర్మాణం పై ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని విభాగాల్లోని నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించింది. కమిటీ విధివిధానాలను, మార్గదర్శకాలను ఆస్కీ సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్) సమగ్ర వివరాలతో ఓ డ్రాప్ట్‌ను రూపొం దించి ప్రభుత్వానికి అందిస్తుంది.
రాజధాని ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, సమాచార వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనేదానిపై సూచనలిస్తుంది. మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డి. సాంబశివరావు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేశారు. కమిటీలో ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, న్యాయ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇన్‌క్యాప్ ఎండీ, ఏపీఐఐసీ ఎండీ కూడా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆరు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.