‘జడ్జీల బిల్లు’కు లోక్‌సభ ఆమోదం
జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటులో మరో అడుగు
{పతిపక్షం డిమాండ్‌పై బిల్లులో ‘ఏకగ్రీవం‘ అన్న పదం తొలగింపు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు వీలు కలిగించే చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల ఎంపికకు ఆరుగురు సభ్యులతో జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ బిల్లుతోపాటుగా, కమిషన్ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 367మంది సభ్యులు ఓటువేయగా, వ్యతిరేకంగా ఎవరూ ఓటువేయలేదు. అయితే, కమిషన్ సిఫార్సు చేసిన ఏదైనా పేరును తిరిగి పరిశీలించాలని రాష్ట్రపతి కోరిన సందర్భాల్లో సదరు వ్యక్తి నియామకానికి కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం
తెలపాలన్న ప్రతిపాదనకు సంబంధించిన క్లాజును బిల్లునుంచి తొలగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్లాజు తొలగింపునకు, సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిమాండ్మేరకు బిల్లుకు అధికారిక సవరణకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోదించడంతో వ్యతిరేకత లేకుండానే బిల్లుకు సభ ఆమోదం లభించింది. కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన సవరణ ప్రకారం,..ఎవరైన అభ్యర్థి ఎంపికపై కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి తిప్పిపంపిన పక్షంలో కమిషన్ సదరు సిఫార్సును మళ్లీ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన అవసరంలేదు. ఏకగ్రీవ ఆమోదం లేకుండా కమిషన్ సిఫార్సును రాష్ట్రపతికి తిప్పిపంపినపుడు సదరు అభ్యర్థిని జడ్జిగా నియమించవలసి ఉంటుంది. కమిషన్ ఏకగ్రీవ ఆమోదం అవసరమంటూ బ్లిలులో పెట్టిన తొలి క్లాజు ప్రకారమైతే కమిషన్‌లోని ఏ ఒక్కసభ్యుడు వ్యతిరేకించినా, సదరు సిఫార్సు చెల్లకుండా పోతుందని ప్రతిపక్షం అభిప్రాయపడటంతో బిల్లులో ఏకగ్రీవం అన్న పదాన్ని తొలగించారు.
పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాని ఓటు
పదేళ్ల తర్వాత లోక్‌సభలో బిల్లుపై ప్రధానమంత్రి ఓటువేశారు. జడ్జీల నియామకానికి గతంలో నియమించిన కొలీజియం వ్యవస్థ రద్దుచేయడానికి ఉద్దేశించినరాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓటుచేయడంతో పదేళ్లతర్వాత ప్రధానమంత్రి లోక్‌సభలో ఓటుహక్కు వినియోగించుకున్నట్టయింది. గత పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన తన పదవీకాలమంతా లోక్‌సభలో ఓటువేయడం కుదరలేదు. సభలో డివిజన్ నంబర్లను సభ్యులకు కేటాయించనందున ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలోకాక, గతంలోని స్లిప్పుల పద్ధతిలోనే నిర్వహించారు.