Etihad
-
ఎయిర్ ఇండియాపై ఎతిహాద్ ఆసక్తి
న్యూఢిల్లీ: గల్ఫ్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎతిహాద్, భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లో ప్రముఖ కార్పొరేట్ గ్రూపు భాగస్వామ్యంతో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేయాలన్నది ఎతిహాద్ ఆలోచన. ఇందుకు సంబంధించి అనిల్ అంబానీ గ్రూపునకు ప్రతిపాదన పంపినట్టు తెలియవచ్చింది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాల విక్రయానికి ప్రైవేటు సంస్థల నుంచి కేంద్రం ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఏఐశాట్స్‌లో 50 శాతం వాటాల విక్రయం కూడా ఇందులోనే కలిసి ఉంది. ‘‘ఎయిర్ ఇండియాను కన్సార్షియం రూపంలో కొనుగోలు చేసేందుకు భాగస్వామి కోసం ఎతిహాద్ అన్వేషిస్తోంది. అనిల్ అంబానీ గ్రూపు సహా పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది’’అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ఈ చర్చలు భాగస్వామ్యం వరకూ వెళ్లకపోవచ్చని, కాకపోతే విదేశీ ఎయిర్‌లైన్ సంస్థలు భారత్ పట్ల ఆసక్తితో ఉన్నట్టు ఇది తెలియజేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ఎయిర్ ఇండియా కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నాయని, సరైన భాగస్వామ్యం కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎతిహాద్ ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేస్తే... ఆ సంస్థకు భారత విమానయాన రంగంలో రెండో పెట్టుబడి అవుతుంది. 2007లో జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్ 24 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఎతిహాద్ ఆసక్తికి కారణం? ‘‘ఎయిర్‌ఫ్రాన్స్–కేఎల్ఎంతో జెట్ ఎయిర్వేస్ గతేడాది నవంబర్‌లో కుదుర్చుకున్న వ్యాపార భాగస్వామ్యం అనంతరం ఆ సంస్థతో సంబంధాలు సరిగ్గా లేవు. కానీ, ఎతిహాద్ భారత్ మార్కెట్‌ను వీడాలనుకుకోవడం లేదు. కనుక అవకాశం కోసం ఎదురు చూస్తోంది’’ అని మరో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంపై అడాగ్ గ్రూపు వర్గాలు స్పందిస్తూ... తమ గ్రూపు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఎయిర్ ఇండియాకు బిడ్ వేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. -
జెట్‌లో ఎతిహాద్ వాటాల విక్రయం!
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్లో తనకున్న వాటాను దుబాయ్‌కి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ విక్రయించవచ్చనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ముగిసేసరికల్లా జెట్‌లో తనకున్న 24 శాతం వాటానూ ఎతిహాద్ విక్రయించేసే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ కాపా–సెంటర్ ఫర్ ఏవియేషన్ వెల్లడించింది. దీనితో అబుదాబి, భారత్ మధ్య విమాన సర్వీసుల క్రమబద్ధీకరణ జరగవచ్చని ట్వీట్ చేసింది. ఎతిహాద్ ఈ వార్తలను ఖండించగా, జెట్ ఎయిర్వేస్ మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కాపా అంచనాలు తప్పని, జెట్ ఎయిర్వేస్ తమకు విలువైన భాగస్వామని ఎతిహాద్ తెలిపింది. జెట్‌లో వాటాల విక్రయ యోచనేదీ లేదని స్పష్టం చేసింది. సంక్లిష్ట బంధం... జెట్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. అలాగే, లండన్‌లో కొన్ని ఫ్లయిట్ స్లాట్లను కూడా జెట్ నుంచి ఎతిహాద్ కొనుగోలు చేసింది. వీటిని మళ్లీ జెట్ లీజుకు తీసుకుంది. ఇక జెట్‌కి చెందిన కొన్ని విమానాలను కొంత సిబ్బందితో సహా ఎతిహాద్ లీజుకు తీసుకుంది. ఇలా ఈ రెండింటి మధ్య సంక్లిష్టమైన ఒప్పందాలున్నాయి. వీరు విడిపోవటం అంత తేలిక కాదనేది పరిశీలకుల మాట. ఈ ఒప్పందంతో ఎతిహాద్కే అధిక లాభం ఉన్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ఎతిహాద్ యూరప్‌లో ఇన్వెస్ట్ చేసిన అలిటాలియా, ఎయిర్ బెర్లిన్ సంస్థలు నష్టాల్లో ఉండగా.. జెట్ ఒక్కటే నిలకడగా కాస్తంత లాభాల్లో ఉంది. ఎమిరేట్స్, కతార్ ఎయిర్‌వేస్‌తో పాటు ఇతర కంపెనీలకు కొంత పోటీనిచ్చేందుకు ఇదే తోడ్పడుతోంది. కాకపోతే కొన్నాళ్లుగా జెట్ కార్యకలాపాల్లో ఎతిహాద్ ప్రమేయం తగ్గుతూ... ప్రస్తుతం కనిష్ట స్థాయులకు పడిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నేపథ్యం ఇదీ..: 2013 ఏప్రిల్‌లో సుమారు రూ.2,069 కోట్లతో జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్ 24 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దేశీ ఏవియేషన్ రంగంలో విదేశీ ఎయిర్‌లైన్స్ ఆటోమేటిక్ మార్గంలో 49 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ నిబంధనలు సడలించడంతో.. జెట్‌లో ఎతిహాద్ ఎయిర్వేస్ 2016లో ఆ మేరకు తన వాటాలు పెంచుకోవచ్చన్న వార్తలు వెలువడ్డాయి. ఇవన్నీ ఊహాగానాలేనని జెట్ కొట్టిపారేసింది. 1992లో ఏర్పాటైన జెట్ ఎయిర్వేస్ 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. 2004లో అంతర్జాతీయ రూట్లలో కూడా సర్వీసులు మొదలుపెట్టి.. 2005లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. 2007లో ఎయిర్ సహారా సంస్థను కొనుగోలు చేసిన కంపెనీ .. జెట్‌లైట్ పేరు కింద చౌక విమానయాన సర్వీసులు అందిస్తోంది. చాన్నాళ్లుగా నష్టాలు చవిచూసినా.. 2015–16లో కొంత కోలుకుని రూ.1,200 కోట్ల లాభం ఆర్జించింది. అయితే, మళ్లీ 2016–17లో ఈ లాభం రూ. 390 కోట్లకు తగ్గిపోయింది. -
జెట్ సీఈవో గ్యారీ ఆకస్మిక రాజీనామా
ముంబై: జెట్ ఎయిర్వేస్ సీఈవో గ్యారీ కెన్నెత్ టూమీ గురువారం రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని జెట్ ఎయిర్వేస్ బీఎస్ఈకి తెలిపింది. కొత్త సీఈవో నియమితులయ్యేవరకూ ప్రస్తుత సీఎఫ్ఓ రవిశంకర్ గోపాలకృష్ణన్ తాత్కాలిక సీఈవోగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లోనే జెట్ ఎయిర్వేస్ సీఈవోగా గ్యారీ టూమీ మూడేళ్ల కాంట్రాక్టుతో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆకస్మిక రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. ఆస్ట్రేలియా జాతీయుడైన టూమీ జెట్ ఎయిర్వేస్లో చేరే ముందు ఎయిర్ న్యూజిలాండ్ గ్రూప్‌కు, ఎయిర్‌లైన్స్ పీఎన్జీ(పాపువా న్యూ గినియా)లకు సీఈవోగా పనిచేశారు. జెట్ వాటా ఎతిహాద్‌కు విక్రయించే విషయంలో ప్రమోటర్ నరేష్ గోయల్‌కు, అప్పటి జెట్ ఎయిర్వేస్ సీఈవో నికోస్ కర్దాస్సిస్లకు విభేదాలు వచ్చాయి. ఆ కారణంగా నిష్ర్కమించిన నికోస్ స్థానంలో గ్యారీ టూమీ వచ్చారు.