
న్యూఢిల్లీ: గల్ఫ్‌కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎతిహాద్, భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా పట్ల ఆసక్తి కనబరుస్తోంది. భారత్‌లో ప్రముఖ కార్పొరేట్ గ్రూపు భాగస్వామ్యంతో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేయాలన్నది ఎతిహాద్ ఆలోచన. ఇందుకు సంబంధించి అనిల్ అంబానీ గ్రూపునకు ప్రతిపాదన పంపినట్టు తెలియవచ్చింది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాల విక్రయానికి ప్రైవేటు సంస్థల నుంచి కేంద్రం ప్రతిపాదనలను ఆహ్వానించింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఏఐశాట్స్‌లో 50 శాతం వాటాల విక్రయం కూడా ఇందులోనే కలిసి ఉంది. ‘‘ఎయిర్ ఇండియాను కన్సార్షియం రూపంలో కొనుగోలు చేసేందుకు భాగస్వామి కోసం ఎతిహాద్ అన్వేషిస్తోంది. అనిల్ అంబానీ గ్రూపు సహా పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది’’అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ఈ చర్చలు భాగస్వామ్యం వరకూ వెళ్లకపోవచ్చని, కాకపోతే విదేశీ ఎయిర్‌లైన్ సంస్థలు భారత్ పట్ల ఆసక్తితో ఉన్నట్టు ఇది తెలియజేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
బ్రిటిష్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ఎయిర్ ఇండియా కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నాయని, సరైన భాగస్వామ్యం కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎతిహాద్ ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేస్తే... ఆ సంస్థకు భారత విమానయాన రంగంలో రెండో పెట్టుబడి అవుతుంది. 2007లో జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్ 24 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం గమనార్హం.
ఎతిహాద్ ఆసక్తికి కారణం?
‘‘ఎయిర్‌ఫ్రాన్స్–కేఎల్‌ఎంతో జెట్ ఎయిర్‌వేస్ గతేడాది నవంబర్‌లో కుదుర్చుకున్న వ్యాపార భాగస్వామ్యం అనంతరం ఆ సంస్థతో సంబంధాలు సరిగ్గా లేవు. కానీ, ఎతిహాద్ భారత్ మార్కెట్‌ను వీడాలనుకుకోవడం లేదు. కనుక అవకాశం కోసం ఎదురు చూస్తోంది’’ అని మరో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంపై అడాగ్ గ్రూపు వర్గాలు స్పందిస్తూ... తమ గ్రూపు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఎయిర్ ఇండియాకు బిడ్ వేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment