
జెట్ సీఈవో గ్యారీ ఆకస్మిక రాజీనామా
ముంబై: జెట్ ఎయిర్‌వేస్ సీఈవో గ్యారీ కెన్నెత్ టూమీ గురువారం రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని జెట్ ఎయిర్‌వేస్ బీఎస్‌ఈకి తెలిపింది. కొత్త సీఈవో నియమితులయ్యేవరకూ ప్రస్తుత సీఎఫ్‌ఓ రవిశంకర్ గోపాలకృష్ణన్ తాత్కాలిక సీఈవోగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లోనే జెట్ ఎయిర్‌వేస్ సీఈవోగా గ్యారీ టూమీ మూడేళ్ల కాంట్రాక్టుతో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆకస్మిక రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. ఆస్ట్రేలియా జాతీయుడైన టూమీ జెట్ ఎయిర్‌వేస్‌లో చేరే ముందు ఎయిర్ న్యూజిలాండ్ గ్రూప్‌కు, ఎయిర్‌లైన్స్ పీఎన్‌జీ(పాపువా న్యూ గినియా)లకు సీఈవోగా పనిచేశారు. జెట్ వాటా ఎతిహాద్‌కు విక్రయించే విషయంలో ప్రమోటర్ నరేష్ గోయల్‌కు, అప్పటి జెట్ ఎయిర్‌వేస్ సీఈవో నికోస్ కర్దాస్‌సిస్‌లకు విభేదాలు వచ్చాయి. ఆ కారణంగా నిష్ర్కమించిన నికోస్ స్థానంలో గ్యారీ టూమీ వచ్చారు.