
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్‌లో తనకున్న వాటాను దుబాయ్‌కి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విక్రయించవచ్చనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ముగిసేసరికల్లా జెట్‌లో తనకున్న 24 శాతం వాటానూ ఎతిహాద్ విక్రయించేసే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ కాపా–సెంటర్ ఫర్ ఏవియేషన్ వెల్లడించింది. దీనితో అబుదాబి, భారత్ మధ్య విమాన సర్వీసుల క్రమబద్ధీకరణ జరగవచ్చని ట్వీట్ చేసింది. ఎతిహాద్ ఈ వార్తలను ఖండించగా, జెట్ ఎయిర్‌వేస్ మాత్రం ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కాపా అంచనాలు తప్పని, జెట్ ఎయిర్‌వేస్ తమకు విలువైన భాగస్వామని ఎతిహాద్ తెలిపింది. జెట్‌లో వాటాల విక్రయ యోచనేదీ లేదని స్పష్టం చేసింది.
సంక్లిష్ట బంధం...
జెట్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. అలాగే, లండన్‌లో కొన్ని ఫ్లయిట్ స్లాట్లను కూడా జెట్ నుంచి ఎతిహాద్ కొనుగోలు చేసింది. వీటిని మళ్లీ జెట్ లీజుకు తీసుకుంది. ఇక జెట్‌కి చెందిన కొన్ని విమానాలను కొంత సిబ్బందితో సహా ఎతిహాద్ లీజుకు తీసుకుంది. ఇలా ఈ రెండింటి మధ్య సంక్లిష్టమైన ఒప్పందాలున్నాయి. వీరు విడిపోవటం అంత తేలిక కాదనేది పరిశీలకుల మాట. ఈ ఒప్పందంతో ఎతిహాద్‌కే అధిక లాభం ఉన్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ఎతిహాద్ యూరప్‌లో ఇన్వెస్ట్ చేసిన అలిటాలియా, ఎయిర్ బెర్లిన్ సంస్థలు నష్టాల్లో ఉండగా.. జెట్ ఒక్కటే నిలకడగా కాస్తంత లాభాల్లో ఉంది. ఎమిరేట్స్, కతార్ ఎయిర్‌వేస్‌తో పాటు ఇతర కంపెనీలకు కొంత పోటీనిచ్చేందుకు ఇదే తోడ్పడుతోంది. కాకపోతే కొన్నాళ్లుగా జెట్ కార్యకలాపాల్లో ఎతిహాద్ ప్రమేయం తగ్గుతూ... ప్రస్తుతం కనిష్ట స్థాయులకు
పడిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
నేపథ్యం ఇదీ..: 2013 ఏప్రిల్‌లో సుమారు రూ.2,069 కోట్లతో జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్ 24 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దేశీ ఏవియేషన్ రంగంలో విదేశీ ఎయిర్‌లైన్స్ ఆటోమేటిక్ మార్గంలో 49 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ నిబంధనలు సడలించడంతో.. జెట్‌లో ఎతిహాద్ ఎయిర్‌వేస్ 2016లో ఆ మేరకు తన వాటాలు పెంచుకోవచ్చన్న వార్తలు వెలువడ్డాయి. ఇవన్నీ ఊహాగానాలేనని జెట్ కొట్టిపారేసింది. 1992లో ఏర్పాటైన జెట్ ఎయిర్‌వేస్ 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. 2004లో అంతర్జాతీయ రూట్లలో కూడా సర్వీసులు మొదలుపెట్టి.. 2005లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. 2007లో ఎయిర్ సహారా సంస్థను కొనుగోలు చేసిన కంపెనీ .. జెట్‌లైట్ పేరు కింద చౌక విమానయాన సర్వీసులు అందిస్తోంది. చాన్నాళ్లుగా నష్టాలు చవిచూసినా.. 2015–16లో కొంత కోలుకుని రూ.1,200 కోట్ల లాభం ఆర్జించింది. అయితే, మళ్లీ 2016–17లో ఈ లాభం రూ. 390 కోట్లకు తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment