ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ!
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రారంభించింది. ఈ విమానంలో అబుదాబి నుంచి ముంబయికి ప్రయాణించాలంటే ఖర్చెంతో తెలుసా.. అక్షరాల రూ.మూడు లక్షలపైనే. అది కూడా వన్ వేకు మాత్రమే. అదే న్యూయార్క్ నుంచి ముంబయి వరకు ప్రయాణించాలంటే మాత్రం దాదాపు రూ.25లక్షలు వెచ్చించాల్సిందే. మొత్తం 496మంది ప్రయాణికులు కూర్చునే సదుపాయం ఉన్న ఈ ఎయిర్ బస్ ఏ 380 ఇప్పటికే ఈ నెల 1న ముంబయిలో అడుగుపెట్టింది కూడా.
ఇందులో నివాస స్థలం, లగ్జరీ స్యూట్, షవర్ రూం, బెడ్ రూం, డబుల్ బెడ్ రూం, లివింగ్ రూమ్ వంటి సౌకర్యాలు ఉండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణంగా ఇది నిలిచింది. మంగళవారం ఈ విమానం నడిపే సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం న్యూయార్క్ నుంచి ముంబయికి ఒకసారి ప్రయాణించాలంటే రూ.25.22లక్షలు చెల్లించాలి. అదే అబుదాబి నుంచి ముంబయి మధ్య ఒకసారి ప్రయాణించాలంటే రూ.3.31లక్షలు వెచ్చించాల్సిందే. అలాగే లండన్ నుంచి ముంబయికి ఒకసారి ప్రయాణించాలంటే రూ.17.25లక్షలు ఖర్చవుతుంది. ఇందులో ఉన్న నివాసంలో 32 అంగుళాల టీవీ, బట్లర్ సర్వీసులు, మంచి చెఫ్స్ కూడా అందుబాటులో ఉండనున్నారు.