evil spirits
-
షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు -
కొరడాతో కొట్టించుకుంటే చాలా.?
తమిళనాడు: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న తరుణంలో కూడా కొంత మంది ప్రజలను మూఢనమ్మకాలు ఇంకా వెంటాడుతున్నాయి. భూ ప్రపంచంలోని ప్రాణులన్నింటిలో మనిషి జ్ఞానవంతుడుగా నిరూపించుకున్నాడు. ఇటువంటి అధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలను నమ్మే మనుషులు లేకపోలేదు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే అక్కడ ఓ దేవాలయంలో ప్రతి ఏటా ఓ విచిత్రమైన ఆచారం మనకు దర్శనమిస్తుంటుంది. తిరువనంతపురంలో అతి ప్రాచీనమైన అచప్పన్ దేవాలయం ఉంది. ఇక్కడ జరిగే ఓ ఉత్సవంలో మహిళలు తమకు మంచి జరగాలని పురోహితులతో మోకాళ్లపై కూర్చొని కొరడాలతో కొట్టించుకుంటారు. ఈ పురాతనమైన అచప్పన్ దేవాలయంలోని పూజారులతో కొరడా పూజ చేయించుకుంటే వారికి పట్టిన చీడ, పీడలు, మానసిక, శారీరక రోగాలు తోలగిపోయి మంచి జరుగుతుందని అక్కడి మహిళలు నమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2000 మందికి పైగా మహిళలు ఈ తంతులో పాల్గొని దెబ్బలు తింటున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు కొరడా దెబ్బలు రుచి చూపించటం గమనార్హం. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం పూజారులతో కొరడాలతో కొట్టించుకొవడం నేరం కాదని పలువురు చెబుతున్నారు. ‘ నేను ఇందులో పాల్గొని కొరడా దెబ్బలు స్వీకరించిన తరువాత నాకున్న శారీరక, మానసిక జబ్బులన్ని నయం అయ్యాయని’ ఓ 60 ఏళ్ల మహిళ చెప్పింది. ఓ విద్యార్థి ‘ తాను బాగా చదవడంలేదని తల్లిదండ్రులు ఆమెను అక్కడి తీసుకెళ్లి కొరడాతో కొట్టించారని, దీంతో ఆ కొరడా వాతలను చూసి స్నేహితులంతా నవ్వుకున్నారని’ చెప్పింది. -
దెయ్యాలు ఉన్నాయని.. సీఎం బంగ్లా ఖాళీ!
రాజకీయ నాయకులకు మూఢ నమ్మకాలు ఉండటం మనకు ఎప్పటినుంచో తెలిసిందే. ఆ విషయం తాజాగా మరోసారి రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయన్న అనుమానంతో.. దాన్ని ఖాళీ చేసి గెస్ట్‌హౌస్‌గా మార్చారు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది నమ్ముతున్నారట. వినడానికి ఇది ఏదోలా అనిపించినా, భవనాన్ని శుద్ధి చేయడానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను గత వారాంతంలో పిలిపించారు. ఈటానగర్‌లో 2009 సంవత్సరంలో దాదాపు రూ. 60 కోట్ల వ్యయంతో కొండమీద ఈ బంగ్లాను కట్టారు. అప్పట్లో దోర్జీ ఖండూ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈ బంగ్లా కట్టిన తర్వాత ఇప్పటివరకు ఏడుగురు ముఖ్యమంత్రులు మారారు. వారిలో దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, జార్బోమ్ గామ్లిన్ దీర్ఘకాలిక వ్యాధితో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నబమ్ టుకీ బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గారు. బంగ్లా నిర్మాణంలో లోపం ఉందని ఒక వాస్తు పండితుడిని ఆయన సంప్రదించారని అంటున్నారు. అయితే.. దాన్ని సరిచేయించుకున్నా కూడా ఆయన పదవి పోయి, కల్ఖో పుల్ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని టుకీ సుప్రీంకోర్టులో సవాలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. కోర్టు తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పుల్ మృతదేహం బంగ్లాలోని ఒక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రెండు నెలల తర్వాత బంగ్లా సిబ్బందిలో ఒకరు కూడా ఆ పక్క గదిలోనే ఫ్యాన్‌కు వేలాడుతూ మరణించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా టుకీ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయారు. ఆయన స్థానంలో పెమా ఖండూ అధికారం చేపట్టారు. కానీ ఖండూ మాత్రం అసలు ఆ బంగ్లాలోకి వెళ్లలేదు. ఆ తర్వాతే ఈ బంగ్లాను గెస్ట్ హౌస్‌గా మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందుకోసమే దాన్ని శుద్ధి చేయడానికి భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. పలువురు పూజారులు, రుషులు, చర్చి ఫాదర్లు అందరూ ప్రార్థనలు జరిపి, భవనంలోని ప్రతి గదికి ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత మాత్రమే గెస్ట్‌హౌస్ తెరిచారు. తనకు వ్యక్తిగతంగా ఈ మూఢ నమ్మకాలు ఏమీ లేవని, తన వ్యక్తిగత జీవితంలో కూడా వీటిని చాలా దూరంగా ఉంచుతానని ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి నబమ్ రెబియా చెప్పారు. అయితే, శుద్ధి తర్వాతైనా గెస్ట్‌హౌస్‌లో ఉండేందుకు ఎవరైనా ధైర్యం చేస్తారా లేదా అనేది చూడాలి.