
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు
Comments
Please login to add a commentAdd a comment