దెయ్యాలు ఉన్నాయని.. సీఎం బంగ్లా ఖాళీ!
రాజకీయ నాయకులకు మూఢ నమ్మకాలు ఉండటం మనకు ఎప్పటినుంచో తెలిసిందే. ఆ విషయం తాజాగా మరోసారి రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయన్న అనుమానంతో.. దాన్ని ఖాళీ చేసి గెస్ట్‌హౌస్‌గా మార్చారు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది నమ్ముతున్నారట. వినడానికి ఇది ఏదోలా అనిపించినా, భవనాన్ని శుద్ధి చేయడానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను గత వారాంతంలో పిలిపించారు. ఈటానగర్‌లో 2009 సంవత్సరంలో దాదాపు రూ. 60 కోట్ల వ్యయంతో కొండమీద ఈ బంగ్లాను కట్టారు. అప్పట్లో దోర్జీ ఖండూ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈ బంగ్లా కట్టిన తర్వాత ఇప్పటివరకు ఏడుగురు ముఖ్యమంత్రులు మారారు. వారిలో దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, జార్బోమ్ గామ్లిన్ దీర్ఘకాలిక వ్యాధితో మరణించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నబమ్ టుకీ బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గారు. బంగ్లా నిర్మాణంలో లోపం ఉందని ఒక వాస్తు పండితుడిని ఆయన సంప్రదించారని అంటున్నారు. అయితే.. దాన్ని సరిచేయించుకున్నా కూడా ఆయన పదవి పోయి, కల్ఖో పుల్ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని టుకీ సుప్రీంకోర్టులో సవాలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. కోర్టు తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పుల్ మృతదేహం బంగ్లాలోని ఒక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రెండు నెలల తర్వాత బంగ్లా సిబ్బందిలో ఒకరు కూడా ఆ పక్క గదిలోనే ఫ్యాన్‌కు వేలాడుతూ మరణించారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా టుకీ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయారు. ఆయన స్థానంలో పెమా ఖండూ అధికారం చేపట్టారు. కానీ ఖండూ మాత్రం అసలు ఆ బంగ్లాలోకి వెళ్లలేదు. ఆ తర్వాతే ఈ బంగ్లాను గెస్ట్ హౌస్‌గా మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందుకోసమే దాన్ని శుద్ధి చేయడానికి భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. పలువురు పూజారులు, రుషులు, చర్చి ఫాదర్లు అందరూ ప్రార్థనలు జరిపి, భవనంలోని ప్రతి గదికి ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత మాత్రమే గెస్ట్‌హౌస్ తెరిచారు.
తనకు వ్యక్తిగతంగా ఈ మూఢ నమ్మకాలు ఏమీ లేవని, తన వ్యక్తిగత జీవితంలో కూడా వీటిని చాలా దూరంగా ఉంచుతానని ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి నబమ్ రెబియా చెప్పారు. అయితే, శుద్ధి తర్వాతైనా గెస్ట్‌హౌస్‌లో ఉండేందుకు ఎవరైనా ధైర్యం చేస్తారా లేదా అనేది చూడాలి.