Ex Chair person
-
ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్ట్
జైసల్మేర్ (రాజస్తాన్): బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సోమవారం అరెస్టయ్యారు. ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించడం తత్సంబంధ లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణ. ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేసి, జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. పోలీసు అధికారుల కథనం ప్రకారం 2007లో జైసల్మేర్‌లో ‘గర్ రాజ్వాడ’ హోటల్ ప్రాజెక్టుకుగాను గోడవన్ గ్రూప్‌నకు ఎస్బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడేళ్లపాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్ మొండిబకాయిగా (ఎన్పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్ ప్రాపర్టీని సీజ్ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది. హోటల్‌ను కొనుగోలు చేసిన కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా చౌదరి చేరడం వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా కనబడుతోంది. విధివిధానాల ప్రకారమే విక్రయం: ఎస్బీఐ విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల క్రమం గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ఎస్బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. 2014లో తమ బోర్డులో చేరిన చౌదరి తో సహా ఏఆర్సీ డైరెక్టర్లందరి పేర్లను ఈ కేసులో చేర్చినట్లు ఎస్బీఐ తెలిపింది. చౌదరి సెప్టెంబర్ 2013లో పదవీ విరమణ చేసినట్లు పేర్కొంది. ప్రేరేపిత చర్య: రజనీష్ కుమార్ ప్రతీప్ చౌదరి అరెస్టు ప్రేరేపితమైన, తీవ్రమైన చర్యని ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ‘ఏఆర్సీలకు ఆస్తులను విక్రయించడానికి ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే జరిగినట్లు సుస్పష్టం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది?’ అని కుమార్ ప్రశ్నించారు. -
ఐదేళ్లుగా సేవ చేస్తున్నా టికెట్ ఇవ్వలేదు
ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో మరోమారు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు 48వ వార్డుకు టీఆర్ఎస్ తరుపున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష పవన్‌రావు కంటతడి పెట్టారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఉపసంహరణ కేంద్రానికి భర్తతో కలిసి వచ్చారు. తనకు బీ–ఫామ్ అందకపోవడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి సేవలందిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పట్టణ ప్రజలకు నిస్వార్థ సేవలను అందజేశానని కంటతడి పెట్టారు. అటువంటి తనను పట్టణ ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఓ పెద్ద మనిషి గెలుపుకోసం ఆహర్నిషలు కృషి చేశానని, అటువంటిది కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూడా బీ–ఫామ్ ఇవ్వలేదన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ తన కొడుకును చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించుకున్నామని, నన్ను తప్పుకోవాలని సోమవారం రాత్రి ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడం సరికాదని ఆవేధన చెందారు. చైర్‌పర్సన్‌గా పని చేసిన నీవు కౌన్సిలర్‌గా ఉండకూడదంటూ ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు సేవలందించిన నాకు వార్డు ప్రజలకు సేవందించే అవకాశం కల్పించమని కోరినా వినలేదని పేర్కొన్నారు. -
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ లీలా శాంసన్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసిన లీలా శాంసన్‌తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్‌కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్‌గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఛైర్మన్‌గా లీలా శాంసన్ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. -
కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు
* మాచర్ల ముస్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య * నాలుగు నెలల క్రితమే భర్త మృతి * అనాథగా మారిన కుమారుడు టీడీపీ నేతల రాజకీయాలకు ఓ కుటుంబం బలైపోయింది. వీరి ఒత్తిళ్ల వల్ల రాజకీయాల్లోకి వచ్చిన మాచర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీదేవి కుటుంబం వారి రాజకీయాలకు చితికిపోయింది. నాలుగు నెలల క్రితం భర్తను కోల్పోయిన శ్రీదేవి, ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి కుమారుడు అనాథగా మిగిలాడు. మాచర్ల టౌన్: రాజకీయాలే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి కుటుంబాన్ని బలితీసుకున్నాయన్న విషయం పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయానుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన భార్య పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిళ్లకు గురై శ్రీదేవి భర్త మల్లికార్జునరావు నాలుగు నెలల క్రితం మృతిచెందారు. భర్తను కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో శ్రీదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మల్లికార్జునరావు మూడేళ్ల క్రితం అమెరికాలో సోదరుల వ్యాపారానికి చేదోడువాదోడుగా ఉండి అక్కడే జీవనం సాగించారు. మున్సిపల్ ఎన్నికల్లో మాచర్ల చైర్పర్సన్ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. టీడీపీ ఒత్తిడితోనే రాజకీయాల్లోకి.. చైర్పర్సన్ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటిస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయని, కౌన్సిలర్‌గా పోటీ చేయాలని ఆమె కుటుంబంపై స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. వార్డు కౌన్సిలర్‌గా ఆమె టీడీపీ తరఫున పోటీకి దిగడంతో, ఆమే చైర్పర్సన్ అభ్యర్థి అని ప్రచారం చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలిస్తే చైర్పర్సన్ పదవి దక్కుతుందని పట్టణంలో పలువురు టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆమె ఆర్థిక సహకారం కూడా అందించినట్లు సమాచారం. కొందరు అభ్యర్థుల గెలుపు కోసం ఆమె అప్పులు చేసి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిసింది. టీడీపీ విజయం సాధిస్తే ముగ్గురు అభ్యర్థులు చైర్‌పర్సన్‌గా పనిచేసే విధంగా అధికార పార్టీలో ఒప్పందం జరిగింది. పార్టీ విజయం సాధించడంతో చైర్‌పర్సన్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. తప్పించేందుకు తీవ్ర ఒత్తిళ్లు.. రెండున్నరేళ్లు పూర్తి కాక ముందే ఆమెను పదవి నుండి తప్పించాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. అయితే ఆమె మరి కొద్ది కాలం చైర్‌పర్సన్‌గా కొనసాగేలా ఆమె భర్త మల్లికార్జునరావు కృషి చేశారు. భార్య పదవి కాపాడేందుకు నిత్యం అధికార పార్టీ నేతల వెంట తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మల్లికార్జునరావు మృతి చెందారు. ఆయన మృతి చెందిన అనంతరం మళ్లీ శ్రీదేవిపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. శ్రీదేవికి టీడీపీ నేతలకు మధ్య జరిగిన ఒప్పందాలకనుగుణంగా అనివార్య పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేశారు. చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. భర్తను పోగొట్టుకుని, పదవిని కోల్పోయిన తర్వాత శ్రీదేవిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆమె తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సొంతవారి ఓదార్పు కూడా కరువైంది. అప్పుల బాధలు, మానసిక ఒతిళ్లూ తట్టుకోలేక మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఆమె పురుగు మందు తాగారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడు సూర్యతేజ ప్రభుత్వాసుపత్రిలోని తల్లి మృతదేహం వద్ద రోదిస్తుండటం చూపురులను కన్నీళ్లు పెట్టించింది.