కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు | Politics remains 'deaths' | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు

Published Fri, Oct 21 2016 8:20 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు - Sakshi

కుటుంబాన్ని బలిగొన్న రాజకీయాలు

* మాచర్ల ముస్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ఆత్మహత్య 
నాలుగు నెలల క్రితమే భర్త మృతి
అనాథగా మారిన కుమారుడు 
 
టీడీపీ నేతల రాజకీయాలకు ఓ కుటుంబం బలైపోయింది. వీరి ఒత్తిళ్ల వల్ల రాజకీయాల్లోకి వచ్చిన మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి కుటుంబం వారి రాజకీయాలకు చితికిపోయింది. నాలుగు నెలల క్రితం భర్తను కోల్పోయిన శ్రీదేవి, ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి కుమారుడు అనాథగా మిగిలాడు. 
 
మాచర్ల టౌన్‌: రాజకీయాలే మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గోపవరపు శ్రీదేవి కుటుంబాన్ని బలితీసుకున్నాయన్న విషయం పట్టణ ప్రజల్లో  చర్చనీయాంశంగా మారింది. రాజకీయానుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన భార్య పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిళ్లకు గురై శ్రీదేవి భర్త మల్లికార్జునరావు నాలుగు నెలల క్రితం మృతిచెందారు. భర్తను కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో శ్రీదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మల్లికార్జునరావు మూడేళ్ల క్రితం అమెరికాలో సోదరుల వ్యాపారానికి చేదోడువాదోడుగా ఉండి అక్కడే జీవనం సాగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మాచర్ల చైర్‌పర్సన్‌ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది.
 
టీడీపీ ఒత్తిడితోనే రాజకీయాల్లోకి..
చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటిస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయని, కౌన్సిలర్‌గా పోటీ చేయాలని ఆమె కుటుంబంపై స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. వార్డు కౌన్సిలర్‌గా ఆమె టీడీపీ తరఫున పోటీకి దిగడంతో, ఆమే చైర్‌పర్సన్‌ అభ్యర్థి అని ప్రచారం చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలిస్తే చైర్‌పర్సన్‌ పదవి దక్కుతుందని పట్టణంలో పలువురు టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆమె ఆర్థిక సహకారం కూడా అందించినట్లు సమాచారం. కొందరు అభ్యర్థుల గెలుపు కోసం ఆమె అప్పులు చేసి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిసింది. టీడీపీ విజయం సాధిస్తే ముగ్గురు అభ్యర్థులు చైర్‌పర్సన్‌గా పనిచేసే విధంగా అధికార పార్టీలో ఒప్పందం జరిగింది. పార్టీ విజయం సాధించడంతో చైర్‌పర్సన్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.
 
తప్పించేందుకు తీవ్ర ఒత్తిళ్లు..
రెండున్నరేళ్లు పూర్తి కాక ముందే ఆమెను పదవి నుండి తప్పించాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. అయితే ఆమె మరి కొద్ది కాలం చైర్‌పర్సన్‌గా కొనసాగేలా ఆమె భర్త మల్లికార్జునరావు కృషి చేశారు. భార్య పదవి కాపాడేందుకు నిత్యం అధికార పార్టీ నేతల వెంట తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మల్లికార్జునరావు మృతి చెందారు. ఆయన మృతి చెందిన అనంతరం మళ్లీ శ్రీదేవిపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. శ్రీదేవికి టీడీపీ నేతలకు మధ్య జరిగిన ఒప్పందాలకనుగుణంగా అనివార్య పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేశారు.
 
చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు..
భర్తను పోగొట్టుకుని, పదవిని కోల్పోయిన తర్వాత శ్రీదేవిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆమె తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు సొంతవారి ఓదార్పు కూడా కరువైంది. అప్పుల బాధలు, మానసిక ఒతిళ్లూ తట్టుకోలేక మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఆమె పురుగు మందు తాగారు.  శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడు సూర్యతేజ ప్రభుత్వాసుపత్రిలోని తల్లి మృతదేహం వద్ద రోదిస్తుండటం చూపురులను కన్నీళ్లు పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement