మాజీ భార్య ఫోన్లో మాల్వేర్ పెట్టి..
కోల్కతా: మాజీ భార్య మొబైల్ ఫోన్లో ఆమెకు తెలియకుండా మాల్వేర్ ఇన్స్టాల్ చేసి, ఆమె ఫోన్ కాల్స్, మేసేజ్లన్నింటినీ గూఢచర్యం చేసిన ఓ వ్యక్తికి 50 వేల రూపాయల జరిమానా పడింది. పశ్చిమబెంగాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
బాధితురాలి వివరాల మేరకు 2013 మేలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చేలా భర్త ప్రవర్తించడంతో పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. ఆ మరుసటి ఏడాదే విడాకులు కోరుతూ హౌరా కోర్టును ఆశ్రయించారు. పెళ్లయిన మొదట్లో తన ఫేస్బుక్ ఎకౌంట్, ఈ మెయిల్ ఎకౌంట్ పాస్వర్డ్లను భర్తకు చెప్పానని, అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్నని, అయితే ఓ సారి తనకు తెలియకుండా తన ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి తన కాల్స్, మెసేజ్లు అన్ని తెలుసుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
పశ్చిమబెంగాల్ సైబర్ న్యాయనిర్ణేత అయిన ఆ రాష్ట్ర ఐటీ కార్యదర్శికి బాధితురాలు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసింది. మాజీ భార్య ఫోన్లో సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి, అన్ని కాల్స్, మెసేజ్ల వివరాలను ఓ వెబ్సైట్ ద్వారా మాజీ భర్త తెలుసుకునేవాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నెల రోజుల్లోపు బాధితురాలకు 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని నిందితుడికి ఆదేశించారు. పశ్చిమబెంగాల్లో ఇలాంటి తరహా కేసులో జరిమానా విధించడం ఇదే తొలిసారి.