ఐటీసీ డీలా, ఓఎన్జీసీ అప్
నాలుగో రోజూ నష్టాలే
- సెన్సెక్స్ 74 పాయింట్లు డౌన్
- ఇంట్రాడేలో 25,000 దిగువకు
- 7,500 దిగువన నిఫ్టీ ముగింపు
ఇరాక్ సంక్షోభం కొనసాగుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి నీరసించాయి. రుతుపవనాల మందగమనం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరచడంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు క్షీణించి 25,031 వద్ద నిలవగా, 18 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 7,493 వద్ద ముగిసింది.
ఇది రెండున్నర వారాల కనిష్టంకాగా, రైల్వే ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న అందోళనలు కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించాయని నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 225 పాయింట్లకుపైగా పతనమై 24,878 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే తొలుత 100 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ మొదలయ్యింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 489 పాయింట్లను కోల్పోయింది.
ఎక్సైజ్ డ్యూటీ ఎఫెక్ట్
సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతారన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 6%పైగా దిగజారింది. మరోవైపు ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీ దాదాపు 5% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌యూఎల్ 2.5-1% మధ్య నష్టపోగా, హీరోమోటో, భెల్, సెసాస్టెరిలైట్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ అదే స్థాయిలో పుంజుకున్నాయి. శుక్రవారం రూ. 221 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 214 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.
అంతర్జాతీయ సహకారంపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే విధంగా దేశీ క్యాపిట ల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు అనుగుణంగా నియంత్రణ విధానాలను అభివృద్ధి చేయనుంది. కీలక కేసులకు సంబంధించి విదేశీ సంస్థల నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు తగిన విధానాలను పటిష్టం చేయనుంది. ఇందుకు మద్దతుగా పూర్తిస్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో అనుసరిస్తున్న నిఘా విధానాలను సెబీ సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
చక్కెర షేర్లకు గిరాకీ
చక్కెరపై దిగుమతి డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 40%కు పెంచడంతోపాటు, మిల్లులకు రూ. 4,400 కోట్ల వరకూ వడ్డీరహిత రుణాలను అదనంగా ఇవ్వనుండటంతో చక్కెర షేర్లకు గిరాకీ పుట్టింది. శ్రీరేణుకా, బజాజ్ హిందుస్తాన్, బలరామ్‌పూర్ చినీ, ధంపూర్, ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, త్రివేణీ, సింభోలీ, ద్వారికేష్, శక్తి షుగర్స్ 10-5% మధ్య పురోగమించాయి. కాగా, మార్కెట్లు నీరసించినప్పటికీ చిన్న షేర్లు వెలుగులో నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,562 లాభపడ్డాయి. 1,387 షేర్లు నష్టపోయాయి.