వడ్డీరేట్లను తగ్గించాలి
వాహన పరిశ్రమ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల అమ్మకాలు గత ఏడాది 2 శాతం వృద్ధి సాధించాయి. ఎక్సైజ్ సుంకం రాయితీల కారణంగా 2014లో తొమ్మిది నెలల పాటు ధరలు తగ్గాయని, ఫలితంగా కార్ల అమ్మకాలు 2 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ(సియామ్) తెలిపింది. ఈ సుంకం రాయితీలను ప్రభుత్వం ఉపసంహరించినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 1 శాతం వృద్ధి సాధిస్తాయని అంచనాలున్నాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు.
అమ్మకాలు 4 శాతం వరకూ పెరగగలవన్న అంచనాలను గతంలో వెల్లడించామని వివరించారు. ఎక్సైజ్ సుంకం పెంపు ప్రభావం కొంత ప్రతికూలంగానే ఉంటుందని సుగతోసేన్ వెల్లడించారు. అయితే చిన్న కార్ల సెగ్మెంట్‌పై ఎక్కువగా ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉండడమే దీనికి కారణమని వెల్లడించారు. సుంకం పెంచుతారనే అంచనాలతో పలువురు గత నెలలోనే వాహనాలను కొనుగోలు చేశారని, ఫలితంగా జనవరి, ఫిబ్రవరిల్లో అమ్మకాలు తగ్గుతాయని వివరించారు.
వడ్డీరేట్లను తగ్గిస్తే, ఎక్సైజ్ పెంపు భారం కొంతవరకైనా తగ్గుతుందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమపై పన్నుల భారం కూడా అధికంగానే ఉందని, దీనిని తొలగించాల్సి ఉందని ఆయన సూచించారు. వాహనాల విక్రయాలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం....,
* 2013లో 18,06,965ఉన్న ప్రయాణికుల కార్ల అమ్మకాలు 2014లో 2.4 శాతం వృద్ధితో 18,51,475కు పెరిగాయి.
* 2013లో కార్ల అమ్మకాలు 10 శాతం క్షీణించాయి. 11 ఏళ్ల తర్వాత కార్ల అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి.
* 2013లో 1,02,75,001 గా ఉన్న మోటార్ సైకిళ్ల అమ్మకాలు గత ఏడాదిలో 6 శాతం వృద్ధితో 1,09,13,003కు పెరిగాయి.
* వాణిజ్య వాహనాల అమ్మకాలు 12 శాతం క్షీణించి 6,06,232కు తగ్గాయి. ఆర్థిక కార్యకలాపాలు ఇంకా పుంజుకోలేనందున ఈ సెగ్మంట్ అమ్మకాలు ఇంకా క్షీణపథంలోనే ఉన్నాయి.