exercise superitendent
-
నాటుసారాను పూర్తిగా నిర్మూలించాం
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్ : దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జిత్‌సింగ్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి వారు దేవరగట్టులో విలేకరులతో మాట్లాడారు. బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్, ఏఆర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. అలాగే బన్ని ఉత్సవంలో పాల్గొనే నెరణికి, నెరణికితండా, కొత్తపేటతో పాటు మరో పది గ్రామాల కొండల్లో ఉన్న నాటుసారా తయారీ స్థావరాలపై దాదాపు 25 రోజులుగా సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. ఆ దాడుల్లో దాదాపు 36 వేల లీటర్ల ఊట, 1000 లీటర్లకు పైగా నాటుసారా బిందెలను ధ్వంసం చేశారన్నారు. బన్ని ఉత్సవమే గాకుండా ఆలూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నాటుసారా అమ్మకాలను, తయారీని అరికట్టేందుకు మున్ముందు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : సూళ్లూరుపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం మద్యం వ్యాపారి వేనాటి సురేష్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంకయ్య వర్గాలు బాహాబాహీకి దిగాయి. మద్యం షాపులు రెన్యువల్ అయ్యాక ఆర్థిక పరమైన లావాదేవీల వ్యవహారంలో సురేష్‌రెడ్డికి, ఈఎస్ అంకయ్యకు మధ్య భేదాభిప్రాయాలు నెలకున్నాయి. దీంతో ఈఎస్ అంకయ్య మద్యంను ఎంఆర్పీ రేట్లకే అమ్మాలని ఆదేశించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఫోన్లోనే నువ్వెంత అంటే నువ్వెంత అని దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈఎస్ అంకయ్య, ఏఎస్ కొమరేష్ స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో సురేష్‌రెడ్డి తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరు బాహాబాహీకి దిగారు. సురేష్‌రెడ్డి అనుచరులు కార్యాలయంపై దాడి చేయడంతో కిటికీ అద్దాలు పగిలాయి. గొడవ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక సీఐ ఎం రత్తయ్య, ఎస్సై అంకమరావు అక్కడికి చేరుకున్నా.. ఇరు వర్గాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో వారు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి అక్కడికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ చర్చలు జరిపి వివాదాన్ని సర్దుబాటు చేశారు.