రైతు మరణం ప్రభుత్వ హత్యే
- బాలునాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
పెనుకొండ రూరల్ : మండలంలోని మక్కాజీపల్లి తాండాకు చెందిన బాలునాయక్ అనే రైతు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతు మరణం ప్రభుత్వ హత్యగానే భావించాలన్నారు. దక్షిణకోరియాకు చెందిన కియో కార్ల కంపెనికి భూములు ఇచ్చే ఎర్రమంచి రైతులు బంజర భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారన్నారు. అయితే ఏడాదికి మూడు పంటలు పండే సాగు భూములను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి రైతులపై ఒత్తిడి తెచ్చి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
తండాలో నివసిస్తున్న గిరిజనులు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. స్థానిక ఆర్డీఓ కార్యాయంలో రైతుల సమావేశం జరిగిన అనంతరం ఎకరాకు రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించారని తెలుసుకున్న రైతు బాలునాయక్ మనోవేదనతోనే గుండెపోటుతో చనిపోయాడన్నారు. ఎకరాకు రూ.40 లక్షల ధర పలుకుతున్న భూములకు రూ.10 లక్షలు ప్రటించడం దారుణమన్నారు. పరిశ్రమలు రావడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. అయితే బంజరు భూముల్లో పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. రైతు హత్య పార్థసారథి చేసిన హత్యగానే భావించాలన్నారు.
జిల్లా మంత్రులు, ఎమ్మెలేలు బినామీల పేర్లతో భూములు కొన్నారని, వారి భూముల జోలికి వెళ్లకుండా రైతుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి వివరించడం జరిగిందన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతామన్నారు. ఎమ్యెల్యేకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే భూసేకరణ ఆపి మృతుని కుటంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.