పరిహారమా..పరిహాసమా?
► పునరావాస కల్పనలోనిర్లక్ష్యం
► పూర్తిస్థాయిలో అందని పరిహారం
► తొమ్మిదేళ్లుగా కాలయాపన
► ప్రారంభం కాని పునరావాస పనులు
► శిథిలమైన గృహాల్లో ముంపు గ్రామాలవాసుల అవస్థలు
వారి త్యాగం వెల కట్టలేనిది... తాత, ముత్తాతల నుంచి పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి ఊరును, చెరగని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్వగ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మాత్రం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొండల మధ్య పచ్చని చెట్ల నడుమ ఉండే ఆ గ్రామస్తులు లక్షల మంది ప్రజల కోసం ఊరిని వదిలేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండించే పొలాలను కూడా వదులుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం వారి పునరావాసం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కొత్త ఇళ్లు నిర్మించుకుందామంటే ఉపయోగం లేదు. పోనీ ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించుకుందామన్నా ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. దీంతో శిథిల గృహాల మధ్య నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపు, ఆర్ఆర్ ప్యాకేజి అమలులో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుమారు 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మార్కాపురం మండలంలో గొట్టిపడియ, అక్కచెరువు తండా, పెద్దారవీడు మండలంలో సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మాగుటూరు తండా, తదితర గ్రామాలు ఉన్నాయి. మొత్తం 11 గ్రామాల్లో 11,365 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 4 వేల గృహాలు శిథిలావస్థకు చేరాయి.
ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు ఒక్క పునరావాస కాలనీ ప్రారంభం కాలేదు. కనీసం ఒక్క గృహం కూడా శంకుస్థాపనకు నోచుకోలేదు. వర్షాకాలంలో మబ్బులు పడితే వారి గుండెల్లో భయం. డ్యామ్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతామన్న ఆందోళన. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ డ్యామ్ ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల స్థలాల సేకరణ పూర్తి కాలేదు. గొట్టిపడియ పంచాయతీలో గొట్టిపడియ, అక్కచెరువు తండా ఉన్నాయి. ఈ రెండింటిలో సుమారు 950 కుటుంబాలు, 650 గృహాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 60 కుటుంబాల వారికి నష్టపరిహారం అందలేదు. 20 ఎకరాలకు సంబంధించి 10 మంది రైతులకు నష్టపరిహార పంపిణీ ఇంకా జరగలేదు. పెద్దారవీడు మండలంలోని చింతలముడిపిలో 56 గృహాలు, 72 కుటుంబాలు, సుంకేసులలో 1131 గృహాలు, 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాలు, 625 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాలు, 715 కుటుంబాలు ఉన్నాయి.
గొట్టిపడియ డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు, సుంకేశుల డ్యామ్ పరిధిలో చింతలముడిపి, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలు మునిగిపోనున్నాయి. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాల వారికి మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అల్లూరి పోలేరమ్మ దేవాలయం వద్ద 60 ఎకరాల్లో కొంత మందికి, కోమటికుంట వద్ద 45 ఎకరాల్లో మరి కొంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్లటంతో తొమ్మిదేళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదు. సుంకేసుల గ్రామస్తులకు తోకపల్లె వద్ద, కలనూతల గ్రామస్తులకు ఇడుపూరు వద్ద , గుండంచర్ల గ్రామస్తులకు దేవరాజుగట్టు వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి ఏడేళ్లు కావస్తోంది. కొంత మందికి ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 1, 2, 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయటం లేదు. ఇదిలా ఉండగా, గొట్టిపడియ లింక్ కాలువ నిర్మాణంలో కూడా 15 ఎకరాలకు రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోవటంతో అటు భూమిని కోల్పోయి, ఇటు నష్టపరిహారం రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో పాటు కాలువకు ఆవల వైపున కూడా సుమారు 20 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని, 2 అవార్డులు(చెట్లకు నష్ట పరిహారం) చెల్లించలేదని బాధిత రైతులు తెలిపారు.