ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
ఎస్పీజీ కంట్రోల్లో నూతన విమానాశ్రయం
రేణిగుంటకు చేరుకున్న {పత్యేక బలగాలు
బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన అదనపు డీజీపీ, ఐజీ
మూడు మార్గాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్
తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం తిరుపతికి రానుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అధునాతన హంగులతో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, విమానాల పార్కింగ్, వాహనాల పార్కింగ్, గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానాశ్రయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైట్లతో అలంకరణ చేశారు. అలాగే తిరుపతిలో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ శంకుస్థాపన పనులు కొలిక్కి వచ్చాయి. మొబైల్ తయా రీ సంస్థలు ఏర్పాటు చేసిన క్యూబికల్స్ను ప్రధానమంత్రి సందర్శించేం దుకు వీలుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేరోజు రాత్రి ప్రధాని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.
భారీ బందోబస్తు..
ప్రధాన మంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ ఠాగూర్ మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లేందుకు వీలుగా మూడు మార్గాల్లో పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం, మొబైల్ తయారీ సంస్థల యూనిట్లకు శంకుస్థాపన, తిరుమల ప్రాంతాలను ఎస్పీజీ సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ అదనపు డీఐజీ వివేక్ ఆనంద్ కనుసన్నల్లో భద్రత పర్యవేక్షణ సాగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి మంగళవారం ఉదయానికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. అదనపు డీఐజీ ఠాగూర్, ఐజీ వేణుగోపాలరావు పోలీసులతో సమావేశమై వారికి తగిన సూచనలు ఇచ్చారు.అనుమానాస్పద వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పరిశీలన..
విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ సిద్ధార్థ్జైన్ పోలీసు ఉన్నతాధికారులకు తగు సూచనలు ఇచ్చారు.