expansion of the cabinet
-
సమర్థత, సమన్వయం, సమీకరణాలు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు ముహూ ర్తం దగ్గరపడుతోంది. ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. లోక్‌సభ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులను కలిపి సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. ఊహించని విధంగా ఒకరిద్దరికి చోటు దక్కే అవ కాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని మంత్రివర్గ కూర్పు ఉంటుంది. పరిపాలన సమర్థత, సామాజిక సమీకరణాలు, ప్రభు త్వం–పార్టీని అనుసంధానించే నేతలతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరిపాలన అంశాలపై పట్టు కలిగినవారు మంత్రివర్గంలో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నలుగురు సీనియర్లకు మళ్లీ చోటు ఖాయమే గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటీఆర్... పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖలను కొత్త పుం తలు తొక్కించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి, మెట్రో రైలుతోపాటు పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. కీలకమైన సాగునీటి రంగంలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సాగునీటి మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం త్వరలోనే సాకరమయ్యే పరిస్థితి నెలకొంది. విస్తృతమైన విద్యారంగంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిపాలనలో అనుభవం ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖపై తనదైన ముద్రవేశారు. కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచి సన్నిహితంగా ఉన్న ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకంగా పని చేశారు. వీరంతా సమర్థతతోపాటు ప్రభుత్వ–పార్టీ కార్యక్రమాల సమన్వయం కనబరచడంతో సామా జిక సమీకణాలపరంగా వారికి మంత్రివర్గంలో మళ్లీ అవకాశం ఉంటుందని, మంత్రివర్గంలో మూడో వం తు మంది పాతవారే ఉంటారని... గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసినవారికి మళ్లీ అవకాశం ఉంటుం దని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నారు. సామాజిక లెక్కలు... మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. స్వతంత్రులుగా గెలిచి పార్టీలో చేరిన వారితో కలిపి టీఆర్ఎస్కు ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. దీంతో ఎక్కువ మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ మంత్రులుగా ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలపరంగా స్వల్ప మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గత అసెంబ్లీలో బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుత శాసనసభ స్పీకర్‌గా ఓసీ సామాజిక వర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికవడంతో ఈసారి మంత్రివర్గంలో ఈ మేరకు ఓసీల సంఖ్యను తగ్గించి బీసీల సంఖ్య పెంచేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా మారిన సమీకరణాల్లో కొత్త మంత్రివర్గంలో బీసీల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గం నుంచి ఇద్దరిని మంత్రులుగా చేర్చుకునే విషయాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవుల కేటాయింపు ఆధారంగా మంత్రివర్గం తుది కూర్పుపై స్పష్టత రానుంది. సామాజిక సమీకరణాలతోపాటు ప్రతి జిల్లాకు ఒక పదవి కేటాయించేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న రెండింటితో కలిపి 33 జిల్లాలకు కచ్చితంగా ప్రాతినిధ్యం ఉండేలా పదవుల పంపకం ఉండనుంది. 17 మంది మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌తోపాటు రెండు చట్ట సభల్లో చీఫ్ విప్, విప్‌లు, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను పరిగణనలోకి తీసుకొని జిల్లాలవారీగా కేటాయింపులు జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. -
మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి!
మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ కొందరికి ఉద్వాసన.. మరికొందరికి శాఖల కత్తిరింపు డీఎస్‌తో పాటు మరికొందరి సర్దుబాటుకూ అవకాశం కీలక శాఖలు సీనియర్ల చేతికి.. త్వరలోనే వెలువడనున్న నిర్ణయం హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారం పలువురు మంత్రులను హడలెత్తిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ తయారు చేశారని.. త్వరలోనే కొందరికి ఉద్వాసన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలనలో ఏడాది అనుభవం గడించినా ఇంకా కొందరు అమాత్యులు బాలారిష్టాలను దాటలేకపోతున్నారని.. సీనియర్ ఎమ్మెల్యేలు అయినా తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న వారు తమ శాఖలపై ఇంకా పట్టు సాధించలేక పోయారన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఏడాదిగా మంత్రుల పనితీరుపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్... ఇక ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. మంత్రుల పనితీరు, వ్యవహార శైలి, అవినీతి తదితర అంశాలపై నిఘా వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నిత్యం సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది. దాని ఆధారంగానే వైద్యారోగ్య శాఖకు ప్రాతినిధ్యం వహించిన అప్పటి డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు ఉద్వాసన పలికారు. అదే సమయంలో ఒకరిద్దరు మంత్రులనూ మందలించారు. ఇపుడు ఏకంగా ఒక్కో మంత్రి పనితీరుపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ను సీఎం తయారు చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులకు సీఎం క్లాస్ తీసుకున్నారు కూడా. ఇలా ఒక్కో మంత్రికి వారి తీరుపై నేరుగానే హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు. ఉద్వాసన ఎవరికి..? ఇప్పటికే అధికార టీఆర్ఎస్ సీనియర్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవలే పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా గులాబీ గూటికి చేరారు. మరోవైపు పార్టీని ముందు నుంచీ అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను మంత్రిని చేస్తానని కేసీఆర్ బహిరంగంగా హామీ ఇచ్చారు. అదే తరహాలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్కూ భరోసా ఇచ్చారు. ఒకేసారి ఈ ఇద్దరికి మంత్రి పదవి రాకపోయినా... కొప్పుల ఈశ్వర్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం పార్టీలో ఉంది. ఇక డీఎస్‌ను కూడా తగిన రీతిలో గౌరవిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయననూ మంత్రివర్గంలో సర్దుబాటు చేసే అంశాన్ని కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా కొందరు మంత్రుల శాఖల కత్తిరింపు కూడా అనివార్యమని తెలిసింది. మంత్రివర్గంలో మహిళలకు చోటు లేని అంశంపై స్వయంగా సీఎం కుమార్తె, ఎంపీ కవిత బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ల్లో ఒక్కో మంత్రిపై వేటు పడే వీలుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు మంత్రులనూ పక్కన పెడతారని, మరో ఇద్దరు మంత్రుల శాఖలను కత్తిరిస్తారని అంటున్నారు. తద్వారా ఖాళీ అయ్యే స్థానాల్లో సీనియర్లకు బాధ్యతలు ఇవ్వడం, ముఖ్యమైన శాఖలను సీనియర్లకు అప్పజెప్పడం ఖాయమని చెబుతున్నారు. ఇలా హోం, రెవెన్యూ శాఖలను వేరే వారికి బదలాయించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తలసాని.. తలనొప్పి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిపదవి వరించింది. ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీనిపై ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గ వర్నర్ సైతం తలసాని రాజీనామా ఆమోదంపై తానే నిర్ణయం తీసుకుంటానన్న సంకేతాలను స్పీకర్‌కు పంపారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఇబ్బందికరంగా మారడంతో తలసానిని తప్పిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పనితీరు ఆధారంగా మరో ముగ్గురు నలుగురు మంత్రులకూ ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో కనీసం ఐదారు ఖాళీలు అందుబాటులోకి వస్తాయని.. కొత్తవారు, సీనియర్లకు అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశముందని, ఈసారి ఒక మహిళకు అవకాశం దక్కే వీలుందని చెబుతున్నారు.