మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి! | On the Council of Ministers 'Progress' | Sakshi
Sakshi News home page

మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి!

Published Wed, Oct 14 2015 6:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి! - Sakshi

మంత్రులపై ‘ప్రోగ్రెస్’ కత్తి!

మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్
కొందరికి ఉద్వాసన.. మరికొందరికి శాఖల కత్తిరింపు
డీఎస్‌తో పాటు మరికొందరి సర్దుబాటుకూ అవకాశం

కీలక శాఖలు సీనియర్ల చేతికి.. త్వరలోనే వెలువడనున్న నిర్ణయం
 
హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారం పలువురు మంత్రులను హడలెత్తిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ తయారు చేశారని.. త్వరలోనే కొందరికి ఉద్వాసన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలనలో ఏడాది అనుభవం గడించినా ఇంకా కొందరు అమాత్యులు బాలారిష్టాలను దాటలేకపోతున్నారని.. సీనియర్ ఎమ్మెల్యేలు అయినా తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న వారు తమ శాఖలపై ఇంకా పట్టు సాధించలేక పోయారన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఏడాదిగా మంత్రుల పనితీరుపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్... ఇక ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. మంత్రుల పనితీరు, వ్యవహార శైలి, అవినీతి తదితర అంశాలపై నిఘా వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నిత్యం సమాచారం తెప్పించుకున్నారని తెలుస్తోంది.

దాని ఆధారంగానే వైద్యారోగ్య శాఖకు ప్రాతినిధ్యం వహించిన అప్పటి డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు ఉద్వాసన పలికారు. అదే సమయంలో ఒకరిద్దరు మంత్రులనూ మందలించారు. ఇపుడు ఏకంగా ఒక్కో మంత్రి పనితీరుపై ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ను సీఎం తయారు చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులకు సీఎం క్లాస్ తీసుకున్నారు కూడా. ఇలా ఒక్కో మంత్రికి వారి తీరుపై నేరుగానే హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు.

 ఉద్వాసన ఎవరికి..?
 ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్ సీనియర్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవలే పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా గులాబీ గూటికి చేరారు. మరోవైపు పార్టీని ముందు నుంచీ అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను మంత్రిని చేస్తానని కేసీఆర్ బహిరంగంగా హామీ ఇచ్చారు. అదే తరహాలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌కూ భరోసా ఇచ్చారు. ఒకేసారి ఈ ఇద్దరికి మంత్రి పదవి రాకపోయినా... కొప్పుల ఈశ్వర్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం పార్టీలో ఉంది. ఇక డీఎస్‌ను కూడా తగిన రీతిలో గౌరవిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయననూ మంత్రివర్గంలో సర్దుబాటు చేసే అంశాన్ని కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా కొందరు మంత్రుల శాఖల కత్తిరింపు కూడా అనివార్యమని తెలిసింది. మంత్రివర్గంలో మహిళలకు చోటు లేని అంశంపై స్వయంగా సీఎం కుమార్తె, ఎంపీ కవిత బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ల్లో ఒక్కో మంత్రిపై వేటు పడే వీలుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు మంత్రులనూ పక్కన పెడతారని, మరో ఇద్దరు మంత్రుల శాఖలను కత్తిరిస్తారని అంటున్నారు. తద్వారా ఖాళీ అయ్యే స్థానాల్లో సీనియర్లకు బాధ్యతలు ఇవ్వడం, ముఖ్యమైన శాఖలను సీనియర్లకు అప్పజెప్పడం ఖాయమని చెబుతున్నారు. ఇలా హోం, రెవెన్యూ శాఖలను వేరే వారికి బదలాయించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
తలసాని.. తలనొప్పి
టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిపదవి వరించింది. ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీనిపై ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గ వర్నర్ సైతం తలసాని రాజీనామా ఆమోదంపై తానే నిర్ణయం తీసుకుంటానన్న సంకేతాలను స్పీకర్‌కు పంపారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఇబ్బందికరంగా మారడంతో తలసానిని తప్పిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పనితీరు ఆధారంగా మరో ముగ్గురు నలుగురు మంత్రులకూ ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో కనీసం ఐదారు ఖాళీలు అందుబాటులోకి వస్తాయని.. కొత్తవారు, సీనియర్లకు అవకాశం కల్పిస్తారని పేర్కొంటున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశముందని, ఈసారి ఒక మహిళకు అవకాశం దక్కే వీలుందని చెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement