Expedience
-
సహాయానికి మీరెంత దగ్గర?
సెల్ఫ్ చెక్ కొందరికి ఇతరులకు సహాయం చేయటమంటే చాలా ఇష్టం. మరికొందరు సొంతవాళ్లకు కూడా సహాయ పడరు. మరి మీ తత్వం ఏంటి? మీరు కూడా స్వార్థంగా ఆలోచిస్తారా? లేక పదిమందికి సహాయపడటానికి సిద్ధంగా ఉంటారా? మీ బిహేవియర్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్ పూర్తి చేయండి. 1. అకస్మాత్తుగా మీకు చాలా డబ్బు దొరికితే ఆ ధనమంతా పేదలకు పంచుతారు. ఎ. అవును బి. కాదు 2. మీ దగ్గర డబ్బు ఉంటే అనాధలను అక్కున చేర్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని అభిమానించేవారికోసం ఎలాంటిపనైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 4. బంధువులు చాలామంది ఇంటికొచ్చిన సందర్భంలో మీ సౌలభ్యాన్ని వదులుకొని వారి సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎ. అవును బి. కాదు 5. సహాయం చేయవలసి వస్తుందని ఎవరితోనూ రిలేషన్స్ మెయింటెయిన్ చేయరు. ఎ. కాదు బి. అవును 6. మిమ్మల్ని ఎవరైనా సహాయం కోరితే వెంటనే అంగీకరిస్తారు. ఎ. అవును బి. కాదు 7. అపాయస్థితిలో ఎవరైనా ఉంటే రిస్క్ తీసుకొని మరీ వారికి సహాయం చేస్తారు. ఎ. అవును బి. కాదు 8. మీరు అనుకున్నది దొరకక పోతే తీవ్రంగా బాధపడిపోతారు. ఎ. కాదు బి. అవును 9. అనుకోని పరిస్థితుల్లో మీ స్నేహితుడు ప్రమాదంలో పడితే వారికి అండగా నిలుస్తారు. ఎ. అవును బి. కాదు 10. మీ వస్తువులను ఎవరు తాకినా తీవ్ర ఆగ్రహాన్ని చూపిస్తారు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ లు 7 దాటితే మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పదిమందితో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ‘బి’లు ఎక్కువగా వస్తే మీలో స్వార్థ బుద్ధి కాస్త ఎక్కువేనని చెప్పొచ్చు. మీ సుఖం చూసుకున్న తర్వాతే ఇతర విషయాలను పట్టించుకుంటారు. ఇతరులకు సహాయ పడాలంటే మీకు చికాకు. ఇలాంటి పద్ధతిని విడిస్తే మంచిది. మనం ఇతరులకు సహాయ పడితేనే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అందుతుందని గుర్తించండి. -
వేమన శతకం వేనోళ్ల వర్థిల్లు
సందేశం వేమన తన శతకం ద్వారా ఈ లోకంలో మనుషుల తీరు తెన్నులను సులువైన భాషలో, సామాన్యులకు అర్ధమయ్యేటట్లు వివరించాడు. ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయి. ఆ యోగి చెప్పిన బాటలో నడిస్తే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించి, అనుకున్న పనులు సులువుగా సాధించి, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. దైనందిన జీవితంలో మనం నడుచుకోవాల్సిన తీరు సులభంగా ఉండేలా చెప్పాడు వేమన. ‘‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు...’’ ఏ పనైనా సాధన ద్వారా అలవడుతుంది, కేవలం ఒకసారి ప్రయత్నిస్తే లాభం ఉండదు,చేసే పనిపై శ్రద్ధాసక్తులు కనబరిస్తే అది తప్పకుండా సాధ్యపడుతుందని చెప్పిన వేమన పలుకులు అక్షర సత్యం. ‘‘ఆపదైనవేళనరసి బంధుల జూడు’’ బంధువులెవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మన కర్తవ్యం, కానీ మనం చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశిస్తే అది బంధుత్వమే కాదు, స్వార్థం అవుతుందని బంధుత్వాన్ని నిర్వచించాడు వేమన. ‘‘చిక్కియున్నవేళ సింహంబునైనను’’ మనం అశక్తులమైనప్పుడు సహనం వహించడం మంచిది, లేకుంటే ప్రతివారికి చులకనవుతాం, అంటూ ఆవేశం అన్నివేళలా అనర్థదాయకమని మృదువుగా చెబుతాడు శతక కర్త. ‘‘తప్పులెన్నువారు తండోపతండంబు’’ ఇతరుల మీద అనవసరమైన నిందలు మోపుతుంటారు కొందరు, అదే తప్పు వారు చేస్తే మాత్రం కిమ్మనరు. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం అవి మనం కనీసం గుర్తించము, కాని ఇతరుల తప్పులను మాత్రం వెంటనే వేలెత్తి చూపుతాం. ఆత్మస్తుతి, పరనింద చేసే వారు ఆత్మవిమర్శ చేసుకునేలా హితవు పలికాడు వేమన. ‘‘పట్టుబట్టరాదు పట్టివిడువరాదు’’ ఏ పనైనా ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తుంటారు, అది మనతో సాధ్యపడదని తలచి ఆపనిని విరమించుకుంటారు కొందరు, కాని పట్టుదలతో ఏ పనైనా మనం సాధించవచ్చని వేమన ఆనాడే మానవాళికి మంచి చెప్పాడు. ‘‘ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు’’ పరుషంగా మాట్లాడి పరులను బాధపెట్టేవారు, క్షణికావేశంతో ఆ మాటలను అనవచ్చు, కాని ఆ మాట పడ్డవారు అప్పటితో మరచిపోలేరు, అది వారిని చాలా కాలం బాధిస్తుంటుంది అంటూ వైవిధ్యమైన పద్యాలను మనకు అందించాడు యోగి వేమన. ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్వయించగల పద్యాలు వేమన సొంతం. ఆయన పద్యాల్లోని సారం అనిర్వచనీయం. ముఖ్యంగా ఆధునిక సమాజంలోని అవకతవకలను తన నీతి వాక్యాల ద్వారా నవసమాజానికి అందించాడు వేమన. ఆయన పద్యాల్లో కొన్నింటినైనా నేర్చుకుంటే, అది మన వికాసానికి తోడ్పడుతుంది. పెద్దలు చిన్నారులకు రోజుకొక పద్యం చొప్పున నేర్పిస్తే మంచి ఫలితముంటుందనడంలో సందేహం లేదు. -
రాజకీయ స్వార్థం కోసమే విభజన ప్రక్రియ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వర్ధన్నపేట : రాజకీయ స్వార్ధం కోసం సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపిం చారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనను బీజేపీ స్వాగతిస్తుందన్నారు. కొన్ని జిల్లాల ఏర్పాటులో ప్రజల అభీ ష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ ముందుకెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయుల కాలం నుంచి వరంగల్, హన్మకొండ నగరాలకు విడదీయరాని బంధం ఉందన్నారు. వీటిని విడదీసి ఈ ప్రాంత వైభవాన్ని కోల్పోయేలా వ్యవహరిస్తున్నారని దు య్యబట్టారు. హన్మకొండ జిల్లా చేయవద్దని అఖిల పక్ష సమావేశంలో తాము డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వ వైఖ రికి నిరసనగా ఈ నెల 30న జిల్లా బంద్‌కు పిలుపునచ్చినట్లు ప్రకటించా రు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో తిరంగ్యాత్ర చేపడుతున్నట్లు వెల్లడిం చారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వరంగల్‌కు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జడ సతీష్, జిల్లా కార్యదర్శి యాకయ్య, ప్రధాన కార్యదర్శి దిండు కిషన్, రాయపురం కుమారస్వామి, గుజ్జ ప్రవీణ్, చిర్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరాడంబరత్వమే నిజమైన ఆశీర్వాదం
సువార్త దేవుడు మనిషిలాగా ఆలోచించడు. అదే ఆయన గొప్పతనం. మనిషి ఆలోచనల నిండా స్వార్థం, సంకుచితత్వమే! కాని దేవునిదెపుడూ సార్వత్రిక దృక్పథం, ఆయన సంకల్పాలు సర్వమానవ కల్యాణ కారకం. మనుషులు కూడా తనలాగే ఆలోచించాలన్నది దేవుని అభీష్టం. మానవాళికి అంతో ఇంతో మేలు దేవునిలాగా ఆలోచించే వారి వల్లే జరిగిందన్నది వాస్తవం. ఆ కోవకు చెందినవాడే దైవజనుడైన మోషే! ఒకసారి మోషే దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి సీనాయి పర్వతం ఎక్కాడు. ఆయన దిగిరావడం ఆలస్యమైంది. కింద మైదానంలో ఇశ్రాయేలీయులు మోషే చనిపోయాడనుకున్నారు. మరో దేవుడ్ని తమకివ్వమని ప్రధాన యాజకుడైన అహరోనును ఒత్తిడి చేశారు. ఆయన ఒక బంగారు దూడను పోతపోసి వారికిస్తే ఆ దూడే తమ దేవుడంటూ దానికి సాగిలపడి పూజలు చేసి సంబరాలు చేయసాగారు. దేవుడది చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. భ్రష్టులైన ఇశ్రాయేలీయులందరినీ ఒక్క దెబ్బతో లయం చేసి నీ ద్వారా కొత్త జనాంగాన్ని పుట్టించి వారిని తన స్వంత జనంగా చేస్తానని దేవుడు మోషేతో అన్నాడు. నిజానికి మోషేకది బంపర్ ఆఫర్!! అయితే మోషే ఎగిరి గంతేయలేదు సరికదా దేవుని పాదాల మీద పడి, తన ప్రజలను క్షమించమని కోరాడు. ఒకవేళ వారి పాపాలు పరిహరించకపోతే తన పేరు కూడా జీవగ్రంథం నుండి తుడిచివేయమన్నాడు. ప్రజలను అంతగా ప్రేమించిన మోషే ప్రార్థనను దేవుడు అంగీకరించి వారిని క్షమించాడు (నిర్గమ 32:7-32). ఒక వ్యక్తిని వ్యతిరేకించడానికి వెయ్యి కారణాలున్నా, ప్రేమించడానికి ఒక చిన్న కారణముంటే అతన్ని ప్రేమించి తీరాలన్నది దేవుని సిద్ధాంతం. భ్రష్టత్వం, తిరుగుబాటుతత్వం, కరడుకట్టిన స్వార్థం మనిషి డిఎన్ఏలోనే ఉంది. అయినా దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నాడంటే దానిక్కారణం సర్వోన్నతమైన ఆయన ప్రేమ, క్షమాపణ స్వభావం. మనిషికి మనిషికి మధ్య పరిఢవిల్లవలసిన స్వచ్ఛమైన ప్రేమ నానాటికీ ఆవిరైపోయి, కృత్రిమత్వం, కృతకస్వభావం, తుమ్మితే ఊడిపోయే బంధాలు, కపటం బయటపడకుండా జాగ్రత్తపడే తెలివి తేటలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అందుకే పైకి బాగానే ఉన్నట్టు సమాజం కనిపిస్తున్నా లోలోపల ఘర్షణలు, వైషమ్యాలు, ఒత్తిళ్లతో ఉడికిపోతోంది. ‘మొహంలో చిరునవ్వు, చేతిలో పిడిబాకు’ ఈనాటి జీవన విధానమైంది. సమాజాభివృద్ధికి అవసరమైన అంశాలు కనుగొనే బాధ్యత శాస్త్రజ్ఞులది. వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యత వాణిజ్యవేత్తలది. దీన్నంతా సమన్వయం చేసే బాధ్యత రాజకీయ నాయకులది కాని ప్రజల్లో శాంతిని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గురుతరమైన బాధ్యత మాత్రం అన్ని మతాల దైవజనులది. ఎందుకంటే కంచంలోకి సమాజం అన్నం తెచ్చిపెడుతుంది. కాని అది తినడానికి ఆకలి కావాలి. సమాజం పరుపును తయారు చేసి ఇస్తుంది కాని పడుకోవడానికి నిద్ర రావాలి. ఆకలి, నిద్రలాంటి అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు శాంతి, సహోదరభావం, ప్రేమ మీదే ఆధారపడి ఉన్నాయి. వాటిని సాధించి పెట్టవలసిన బాధ్యత దైవజనులదే. అందుకే ప్రజలను మోషేలాగా ప్రేమించి వారి విషయమై దేవుని వద్ద ప్రాధేయపడే కృపాయుగపు నవతరం దైవజనుల కోసం సమాజం ఎదురు చూస్తోంది. ప్రజలను వాడుకునే దైవజనులకు కొరత లేదు. కాని ప్రజల శాంతి కోసం పాటుపడే దైవజనులే కరువయ్యారు. నీవెక్కడుంటావని ఒకసారి యేసుప్రభువునడిగితే, నాకు తలదాచుకునేంత స్థలం కూడా లేదన్నాడాయన. దైవజనుల్లో ఆ నిరాడంబరత్వం, నిబద్ధత, దేవునికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచేతత్వం ఉంటే అది నిజంగా ఎంత ఆశీర్వాదకరం! - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
ఒకవైపు దాడులు.. మరో వైపు వేధింపులు
- అడ్డగోలు సంపాదన కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు - బాధితుల జాబితాలో తహశీల్దార్, వీఆర్వో, వీఆర్ఏలు - పోలవరం, పట్టిసీమ పనుల పేరుతో అధికారులకు వేధింపులు సాక్షి ప్రతినిధి, విజయవాడ : నేతలు తమ స్వార్థం కోసం అధికారులపై దాడులకు దిగుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతల తీరు అధికారులను బెంబేలెత్తిస్తోంది. అక్రమ సంపాదన కోసం కొందరు నేతలు నేరుగా అధికారులపై దాడులకు దిగుతుండగా, మరోవైపు అభివృద్ధి పేరుతో పట్టిసీమ, పోలవరం పనులు వేగంగా జరపాలని, అందుకు అవసరమైన పొక్లెయిన్లు, ఇతర వాహనాలు అధికారులు కాంట్రాక్టర్లకు సమకూర్చాలని మంత్రులు కలెక్టర్, ఇతర అధికారులపై ఒత్తిడి పెంచారు. పోలవరం కుడికాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పుకునేందుకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లాలో ఉన్న పొక్లెయిన్లను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బాబు పై వత్తిడి పెంచారు. దీనితో ఆయన ఆర్డీవోలు, తహశీల్దార్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును ఒక పొక్లెయిన్ యజమాని ఇంటికి ఆర్డీవో, తహశీల్దార్లు పంపించారు. ప్రొక్లెయిన్ కోసం వచ్చిన విషయాన్ని ఆయనతో చెప్పగా తాను మంత్రి అనుచరుడినని, తన పొక్లెయిన్ ఇవ్వబోనంటూ ఎదురు తిరిగాడు. ఇదే విషయం ఉన్నతాధికారులకు చెబితే వారు శ్రీనివాసరావుకు చీవాట్లు పెట్టడంతో పాటు బూతులు తిట్టారు. దీనిని భరించలేని శ్రీనివాసరావు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డాడు. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రస్తుతం నూతన రాజధాని పరిధిలో అధికారులు, సిబ్బంది ఎంత మేరకు ఒత్తిడికి లోనవుతున్నారో అర్ధమౌతోంది. పోలవరం కుడికాలువ తవ్వకాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే మంత్రి ఉమా ఆదేశాల మేరకు కలెక్టర్, ఈఎన్సీలు కాలువల వద్దేకూర్చుని సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. రైతుల భూములను తీసుకుని వారికి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తుండడంతో అధికారులను గ్రామస్తు లు నిలదీస్తున్నారు. ఇక జిల్లాలోని పొక్లెయిన్లు, బుల్డోజ ర్లు, టిప్పర్లను తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ, రవాణా సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయి. - పదేళ్లుపాటు అధికారానికి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు అందినంత వరకు దోచుకుంటున్నారు. నీరు-చెట్టు పథకం ద్వారా లక్షలు వెనుకేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇసుక దందాలు, భూ ఆక్రమణల్లో అధికారుల్ని బెంబేలెత్తిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు, ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపై దాడికి తెగబడుతున్నారు. - ఉద్యోగులకు వారంలో మూడు లేదా నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ బిల్లులు ఇవ్వడం లేదు. వివిధ అంశాలకు సంబంధించి సమాచారాన్ని ఆన్లైన్లో పంపాలని కోరుతున్నారు. నిధులు విడుదల చేయకుండానే ఆయా పథకాలను పురోగతి బాట పట్టించాలనే నిబంధనలు విధిస్తున్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్వార్డుల్లో దాతలను ఉద్యోగులే చూడాలని షరతులు విధిస్తున్నారు. - ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు హెల్త్‌కార్డులు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో వారంలో ఐదు రోజుల పనిదినాలు మాత్రమే ఉంటాయని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు. - ప్రతి సోమవారం కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ గంటల తరబడి జరుగుతోంది. ఎవరైనా ఉద్యోగి ఈ కార్యక్రమానికి గైర్హాజరైతే వారికి నోటీసులు జారీచేస్తున్నారు. ఒక్కొక్కసారి వీడియో కాన్ఫరెన్స్ రాత్రి 10 గంటల వరకు జరుగుతోంది. మహిళా ఉద్యోగులు ఇంటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సివస్తోంది. - ముసునూరు తహశీల్దార్ వనజాక్షి సరిహద్దులు దాటి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని కేబినెట్ సమావేశం నిర్ణయించడం, తప్పంతా ఆమెదే అనే ధోరణిలో ప్రభుత్వం నిర్ణయించటంతో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినా అధికారులు తమకు ఎందుకులే అనే పద్ధతిని అవలంబిస్తున్నారు. - కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో కిందిస్థాయి సిబ్బంది ముందే అధికారులకు చీవాట్లు పెట్టడంతో కిందిస్థాయి ఉద్యోగులు మాట వినని పరిస్థితి ఉంది. - ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల చేతిలో దాడికి గురయ్యారు. రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించినా చివరకు వనజాక్షిదే తప్పంటూ క్యాబినెట్లో చర్చించడం విశేషం. - గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టేందుకు అధికార పార్టీ నేతల అనుచరులు సిద్ధమయ్యారు. దీన్ని అడ్డుకోవడానికి వెళ్లిన వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావుపై టీడీపీనేతలు దాడి చేసి గాయపరిచారు.