నిరాడంబరత్వమే నిజమైన ఆశీర్వాదం
సువార్త
దేవుడు మనిషిలాగా ఆలోచించడు. అదే ఆయన గొప్పతనం. మనిషి ఆలోచనల నిండా స్వార్థం, సంకుచితత్వమే! కాని దేవునిదెపుడూ సార్వత్రిక దృక్పథం, ఆయన సంకల్పాలు సర్వమానవ కల్యాణ కారకం. మనుషులు కూడా తనలాగే ఆలోచించాలన్నది దేవుని అభీష్టం. మానవాళికి అంతో ఇంతో మేలు దేవునిలాగా ఆలోచించే వారి వల్లే జరిగిందన్నది వాస్తవం.
ఆ కోవకు చెందినవాడే దైవజనుడైన మోషే! ఒకసారి మోషే దేవుని నుండి ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి సీనాయి పర్వతం ఎక్కాడు. ఆయన దిగిరావడం ఆలస్యమైంది. కింద మైదానంలో ఇశ్రాయేలీయులు మోషే చనిపోయాడనుకున్నారు. మరో దేవుడ్ని తమకివ్వమని ప్రధాన యాజకుడైన అహరోనును ఒత్తిడి చేశారు. ఆయన ఒక బంగారు దూడను పోతపోసి వారికిస్తే ఆ దూడే తమ దేవుడంటూ దానికి సాగిలపడి పూజలు చేసి సంబరాలు చేయసాగారు. దేవుడది చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. భ్రష్టులైన ఇశ్రాయేలీయులందరినీ ఒక్క దెబ్బతో లయం చేసి నీ ద్వారా కొత్త జనాంగాన్ని పుట్టించి వారిని తన స్వంత జనంగా చేస్తానని దేవుడు మోషేతో అన్నాడు. నిజానికి మోషేకది బంపర్ ఆఫర్!! అయితే మోషే ఎగిరి గంతేయలేదు సరికదా దేవుని పాదాల మీద పడి, తన ప్రజలను క్షమించమని కోరాడు. ఒకవేళ వారి పాపాలు పరిహరించకపోతే తన పేరు కూడా జీవగ్రంథం నుండి తుడిచివేయమన్నాడు. ప్రజలను అంతగా ప్రేమించిన మోషే ప్రార్థనను దేవుడు అంగీకరించి వారిని క్షమించాడు (నిర్గమ 32:7-32).
ఒక వ్యక్తిని వ్యతిరేకించడానికి వెయ్యి కారణాలున్నా, ప్రేమించడానికి ఒక చిన్న కారణముంటే అతన్ని ప్రేమించి తీరాలన్నది దేవుని సిద్ధాంతం. భ్రష్టత్వం, తిరుగుబాటుతత్వం, కరడుకట్టిన స్వార్థం మనిషి డిఎన్‌ఏలోనే ఉంది. అయినా దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నాడంటే దానిక్కారణం సర్వోన్నతమైన ఆయన ప్రేమ, క్షమాపణ స్వభావం. మనిషికి మనిషికి మధ్య పరిఢవిల్లవలసిన స్వచ్ఛమైన ప్రేమ నానాటికీ ఆవిరైపోయి, కృత్రిమత్వం, కృతకస్వభావం, తుమ్మితే ఊడిపోయే బంధాలు, కపటం బయటపడకుండా జాగ్రత్తపడే తెలివి తేటలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అందుకే పైకి బాగానే ఉన్నట్టు సమాజం కనిపిస్తున్నా లోలోపల ఘర్షణలు, వైషమ్యాలు, ఒత్తిళ్లతో ఉడికిపోతోంది. ‘మొహంలో చిరునవ్వు, చేతిలో పిడిబాకు’ ఈనాటి జీవన విధానమైంది. సమాజాభివృద్ధికి అవసరమైన అంశాలు కనుగొనే బాధ్యత శాస్త్రజ్ఞులది. వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యత వాణిజ్యవేత్తలది. దీన్నంతా సమన్వయం చేసే బాధ్యత రాజకీయ నాయకులది కాని ప్రజల్లో శాంతిని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గురుతరమైన బాధ్యత మాత్రం అన్ని మతాల దైవజనులది. ఎందుకంటే కంచంలోకి సమాజం అన్నం తెచ్చిపెడుతుంది.
కాని అది తినడానికి ఆకలి కావాలి. సమాజం పరుపును తయారు చేసి ఇస్తుంది కాని పడుకోవడానికి నిద్ర రావాలి. ఆకలి, నిద్రలాంటి అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు శాంతి, సహోదరభావం, ప్రేమ మీదే ఆధారపడి ఉన్నాయి. వాటిని సాధించి పెట్టవలసిన బాధ్యత దైవజనులదే. అందుకే ప్రజలను మోషేలాగా ప్రేమించి వారి విషయమై దేవుని వద్ద ప్రాధేయపడే కృపాయుగపు నవతరం దైవజనుల కోసం సమాజం ఎదురు చూస్తోంది. ప్రజలను వాడుకునే దైవజనులకు కొరత లేదు. కాని ప్రజల శాంతి కోసం పాటుపడే దైవజనులే కరువయ్యారు. నీవెక్కడుంటావని ఒకసారి యేసుప్రభువునడిగితే, నాకు తలదాచుకునేంత స్థలం కూడా లేదన్నాడాయన. దైవజనుల్లో ఆ నిరాడంబరత్వం, నిబద్ధత, దేవునికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచేతత్వం ఉంటే అది నిజంగా ఎంత ఆశీర్వాదకరం!
- రెవ.టి.ఎ. ప్రభుకిరణ్