Experience Certificate
-
ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే ఎలా?
►ఆమె పేరు డాక్టర్ సునీత (పేరు మార్చాం). ఆమె ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్లు కాంట్రాక్టు వైద్యురాలిగా పనిచేస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం అనుభవ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. కానీ అక్కడి ఆసుపత్రి అధిపతి కేవలం మూడేళ్లకే సర్టిఫికెట్ ఇచ్చారు. ఏవో సాంకేతిక కారణాలు చూపించి మూడేళ్లకే ఇవ్వడంతో నాలుగు వెయిటేజీ మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తనకు ప్రభుత్వ వైద్య ఉద్యోగం రావాల్సి ఉండగా, ఇప్పుడు జాబితాలో పేరు లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందని ఇలా పలువురు అభ్యర్థులు వైద్య,ఆరోగ్యశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు లిఖితపూర్వకంగా, మరికొందరు నేరుగా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అలాంటి ఫిర్యాదుల్లో న్యాయం ఉన్నట్లు తేలితే పరిశీలిస్తామని, దీనిపై విచారణ చేసి తగు చర్యలు చేపడతామని అంటున్నారు. దీంతో సకాలంలో పూర్తి కావాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. వాస్తవానికి గత శనివారమే ముగియాల్సిన వెరిఫికేషన్ ప్రక్రియ, కొన్ని కారణాల వల్ల పొడిగించారు. అనుభవపత్రాల్లో కొర్రీలు... వైద్య ఆరోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మొత్తం వివిధ విభాగాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ అర్హతతో కూడిన 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులైతే 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరు నెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. కానీ కొందరికి మాత్రం సంబంధిత వైద్యాధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో కొర్రీలు పెట్టారని కొందరు డాక్టర్లు విమర్శిస్తున్నారు. వెయిటేజీ మార్కులకు సంబంధించి అనుభవ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో ఎక్కడికక్కడ రాజకీయాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోయామని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులతో తుది జాబితా విడుదలకు ఆటంకాలు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
హైటెక్ నిందితుల అరెస్ట్
బెంగళూరు : ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో పని చేసినట్లు నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రం (ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్), రిలీవింగ్ లెటర్స్ ఇచ్చి మోసం చేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు. వారికి సహకరించిన మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఆయనిక్కడ మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. సౌత్ ఎండ్ సర్కిల్‌కు చెందిన కిరణ్‌కుమార్ జయనగర 9వ బ్లాక్‌లోని ఒక ప్రముఖ హోటల్లో ఇన్ఫో మ్యాట్రిక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కృష్ణారెడ్డి లేఔట్ నివాసి రంగరాజు, బిస్మిల్లా నగర్ వాసి షేక్ అబ్దుల్ అల్తాజ్ అహమ్మద్, సుల్తాన్‌పాళ్య వాసి బాలరాజుల సాయంతో నిరుద్యోగులను సంప్రదించాడు. ప్రముఖ కంపెనీల పేర్లతో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, శ్యాలరీ సర్టిఫికెట్లు ఇస్తే ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఎక్కువ జీతాలు వస్తాయని నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు రాబట్టాడు. నిరుద్యోగులకు ఐడీ కార్డులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇచ్చాడు. ఇలా సుమారు 20 ప్రముఖ కంపెనీల పేర్లతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఐడీ కార్డులు, లెటర్హెడ్లు, 25 ఫోన్లు, సిమ్‌కార్డులు, నకిలీ ఐడీ కార్డులు, రిలీవింగ్ లెటర్హెడ్లు, నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, సీల్లు స్వాధీనం చేసుకున్నారు.