కృత్రిమ మాంసం రెడీ
తయారీ బృందంలో తెలుగు శాస్త్రవేత్త
నాలుగైదేళ్లలో మార్కెట్లోకి: ఉమా వలేటి
వాషింగ్టన్: మాంసం కోసం జంతుబలి అవసరం లేకుండా.. కల్తీలేని, ఆరోగ్యకర మాంసాన్ని అందించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఓ తెలుగు శాస్త్రవేత్తతో కూడిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగశాలలో జంతు కణజాలం నుంచి కృత్రిమంగా మాంసాన్ని రూపొందించింది. ప్రయోగం విజయవంతం కావటంతో రాబోయే రోజుల్లో ప్రయోగశాలలో పెద్ద మొత్తంలో కృత్రిమ మాంసాన్ని తయారుచేయవచ్చని బృంద సభ్యుడైన తెలుగు శాస్త్రవేత్త ఉమా వలేటి తెలి పారు. దీంతో మాంసం కోసం జంతువులను వధించాల్సి న అవసరం ఇకపై ఉండదని హృద్రోగ నిపుణుడు కూడా అయిన వలేటి చెప్పారు. ఇలాంటి మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉండదని, బ్యాక్టీరియా వల్ల చెడిపోదని దీంతో ఎక్కువకాలం నిలువ ఉంచుకోవచ్చన్నారు.
కొత్త కణాల్ని తయారుచేసుకునే సామర్థ్యమున్న కొన్ని జంతువుల కణాలు సేకరించి.. దీనికి ఆక్సిజన్, పోషక పదార్థాలు అందిస్తే 9 నుంచి 21 రోజుల్లో మాంసం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఎక్కువగా వినియోగించే ఎద్దు, పంది, కోడి మాంసాలపై ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో రెస్టారెంట్లలో, ఐదేళ్లలో రిటైల్ మార్కెట్లలో దీన్ని ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. మొదటి ఉత్పత్తి పరిశ్రమ అమెరికాలో నెలకొల్పుతామని, ఇండియా, చైనాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలోని మెం ఫిస్లో స్టెమ్ సెల్ బయాలజిస్టు నికోల స్ జెనోవెసే, బయో మెడికల్ ఇంజినీర్ విల్ క్లెమ్తో కలిపి వలేటి మెంఫిక్ మీట్స్ను స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.