ఏటా లక్ష్యాలకు టాటా!
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించి, కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాదిరూపాయలు వెచ్చిస్తోంది. పేదరిక నిర్మూలన, పథకాలన్నీ అర్హులందరికీ అందాలంటే కుటుంబ సంక్షేమం అమలు తప్పని సరి. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాదీ లక్ష్యాలను నిర్ధేశించి, నిధులు విడుదల చేస్తోంది. అయితే జిల్లా అధికారులకు ఇవేవీ పట్టడంలేదు. ఏటా ఏదో ఒక సాకు చెప్పి లక్ష్యాలను అలక్ష్యం చేస్తున్నారు. కుటుంబ సంక్షే మ శస్త్ర చికిత్సల లక్ష్యానికి గండి కొడుతోంది. ఏడు నెలల వ్యవధికి నిర్దేశించిన లక్ష్యంలో సగం మందికి మాత్రమే వారు ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు చేయగలిగారు.
అయితే అధికారులకు ఇదేమీ కొత్తకాదు. ప్రతి ఏడాదీ ఇదే తంతు. ఈ ఏడాదైనా వైద్యారోగ్యశాఖాధికారులు కొత్తగా ఏమైనా చేస్తారని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. జనాభా నియంత్రణలో అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని సాధించక పోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు నాటికి కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యం 10,500 కాగా కేవలం 5,670 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లక్ష్యం 18 వేలుగా నిర్ధారించారు. అయితే దీనికి ఇంకా ఐదు నెలలు మాత్రమే గడువుంది. ఈలోగా దాదాపు 13వేల శస్త్ర చికిత్సలు చేయాలి. అధికారులు పనితీరు తెలిసిన వారు ఇప్పటికే దీనిపై పెదవి విరిచేస్తున్నారు. ఏడు నెలల వ్యవధిలో ఐదు వేల శస్త్రచిక్సితలు చేసిన వారు ఐదు నెలల వ్యవధిలో 13 వేల శస్త్రచికిత్సలు నిర్వహించడం సాధ్యపడేపని కాదని కొట్టి పడేస్తున్నారు.
ఏటా విఫలమే...
గత ఏడాది అధికారులకు 21 వేల శస్త్ర చికిత్సలు లక్ష్యంగా నిర్ధారించగా 19వేల వరకు చేశారు. అయితే శతశాతం పూర్తి చేసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇలా ప్రతి ఏడాది అధికారులు లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో ఆపరేషన్లు చేయకపోవడం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల మహిళలు ఈ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి ముందుకురావడం లేదని సమాచారం