స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: భారత్ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తుంది. తక్కువ కాస్ట్.. ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలు దారులు ఎగబడిమరి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021– 22) మొబైల్ ఫోన్ ఎగుమతులు రూ. 43,500 కోట్ల స్థాయిని అధిగమించవచ్చని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వెల్లడించింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీము దీనికి తోడ్పడగలదని పేర్కొంది. భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతులు ఈ నెల తొలివారాని కల్లా 5.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 42,000 కోట్లు) చేరాయని ఐసీఈఏ వివరించింది.
2020–21 ఆఖరు నాటికి నమోదైన 3.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే (దాదాపు రూ. 24,000 కోట్లు) ఇది 75 శాతం అధికమని పేర్కొంది. ‘మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు రూ. 43,500 కోట్ల స్థాయిని దాటగలవు‘ అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్లు, చిప్‌ల కొరత వంటి ఎన్నో సవాళ్లతో కుదేలైన పరిశ్రమ తిరిగి పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఎక్కువగా దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం.. తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతయ్యేవని మహీంద్రూ వివరించారు. అయితే, ప్రస్తుతం కంపెనీలు యూరప్, ఆసియాలోని సంపన్న మార్కెట్లను కూడా లక్ష్యంగా పెట్టుకుంటున్నాయని తెలిపారు. ‘ఈ మార్కెట్లకు ఎగుమతి చేయాలంటే అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. భారత్‌లోని తయారీ కేంద్రాలు ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి‘ అని మహీంద్రు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీము కోసం అయిదు అంతర్జాతీయ కంపెనీలు (శాంసంగ్, ఫాక్స్‌కాన్ హోన్ హాయ్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగాట్రాన్‌తో పాటు దేశీ సంస్థలు లావా, భాగ్వతి (మైక్రోమ్యాక్స్), ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, యూటీఎల్ నియోలింక్స్, ఆప్టీమస్ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఎంపికయ్యాయి.