టి.బిల్లు గడువు పొడిగించండి: ప్రణబ్‌కు సీఎం లేఖ
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చకు మరో మూడు వారాల గడువు పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిరణ్ మంగళవారం ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చను ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని ప్రణబ్‌కు రాసిన లేఖలో కిరణ్ ఆరోపించారు. దీని వల్ల సమయం వృథా అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టి.బిల్లు గడువు పొడిగించాలని ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు. బిల్లుపై చర్చకు ఇచ్చిన వారం రోజుల గడువును మరింత పోడిగించాలని సీఎం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు పలువురు మంత్రులు సీఎం రాసిన లేఖలో సంతకాలు చేశారు.
మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు ఆ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. గత నెలలో అసెంబ్లీకి వచ్చిన టి.బిల్లుపై చర్చ జనవరి 23తో ముగియనుంది. అయితే చర్చ గడువుకు కొంత సమయం కావాలని గతంలో సీఎం కిరణ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. దాంతో వారం రోజుల గడువు పెంచుతూ ప్రణబ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన బిల్లు అసమగ్రంగా ఉందని, బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపాలని సభా నాయకుడు, ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
సీఎం కిరణ్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సీఎంపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. సీఎం చర్యలకు నిరసనగా అసెంబ్లీ సజావుగా సాగకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఆడ్డుకుంటున్నారు. దీంతో టి.బిల్లుపై చర్చ గడువు మరింత పెంచాలని సీఎం కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రపతికి లేఖ రాశారు.